గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిన చందంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వ్యవహారం ఉంది. వరద బాధిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటిస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై చేసిన విమర్శలను చూస్తే గుడ్డు, పిల్ల గుర్తు రాక మానవు.
తూర్పుగోదావరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో లోకేశ్ సోమవారం పర్యటించారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌పై ఫైర్ అయ్యారు.
‘జగన్‌రెడ్డి ఆకాశంలోనే ఎక్కువకాలం పయనిస్తున్నారు. గాలి ప్రయాణాలు తగ్గించి ఆయన ఓ సారి కింద కాలు పెట్టాలి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. రాష్ట్రంలో పరిస్థితిని ఏ సీఎం అయినా ప్రధానికి వివరిస్తారు. కానీ ప్రధానమంత్రే సీఎంకు ఫోన్ చేసి తెలుసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదేనా రైతు, సంక్షేమ రాజ్యం?’ అని ప్రశ్నించారు.
జగన్ అంటే జనం; జనం అంటే జగన్ అనే నానుడే ఉంది. అలాంటిది జగన్ ఆకాశంలో ఎక్కువ కాలం పయనిస్తున్నారని లోకేశ్ విమర్శించడం విడ్డూరంగా ఉంది. గాలి ప్రయాణాలు తగ్గించి ఒకసారి కింద కాలు పెట్టాలని జగన్‌ను కోరడం విచిత్రంలో కెల్లా విచిత్రం గా ఉందనే విమర్శలు లేకపోలేదు.
అసలు ఎప్పుడూ ట్విటర్‌లో గడుపుతూ, అంతర్జాలం నుంచి నేల దిగని లోకేశ్‌నాయుడు …జగన్‌ను జనంలోకి రావాలని డిమాండ్ చేయడం ఏంటోనని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లాక్‌డౌన్ సడలించినా తండ్రీకొడుకులు హైదరాబాద్‌లో ఇల్లు దాటి బయటకు రాని విషయం అందరికీ తెలిసిందే. ఇలాగైతే పార్టీ బతికి బట్ట కట్టేదెట్టా అని టీడీపీ నాయకులు, శ్రేణులు విమర్శిస్తుండడంతో రెండు రోజులుగా లోకేశ్‌ను బాబు పంపుతున్న విషయం తెలిసిందే.
ఏడాదిన్నర పాటు పాదయాత్ర, అంతకు ముందు వివిధ సమస్యలపై దీక్షలు, ఇతరత్రా ఆందోళనలు నిర్వమిస్తూ ఇరవై నాలుగు గంటలూ జగన్ జనంతోనే ఉన్నారు. జనం సమస్యలను ఆయన తెలుసుకున్నంతగా మరే నాయకుడు తెలుసుకోలేదు.
ఇప్పుడు వరద బాధిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించడం కూడా లోకేశ్ దృష్టిలో తప్పైందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ట్విటర్ దిగి నేల దిగిన లోకేశ్‌కు …భూమ్మీద ఏం జరుగుతున్నదో అర్థం కావాలంటే కొంత సమయం పడుతుందనే సెటైర్లు విసురుతున్నారు.