అత్యున్నత చట్టసభలో సామాన్య ప్రజాప్రతినిధిగా అడుగు పెట్టిన డాక్టర్ గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఆయన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మధ్య తరగతి కుటుంబానికి చెందిన డాక్టర్ గురుమూర్తి అనూహ్యంగా తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలిచారు.
వైఎస్ జగన్ ప్రోత్సాహంతో, ప్రజల ఆశీస్సులతో ఆయన లోక్‌సభలో అడుగు పెట్టారు. ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారాన్ని తెలుగులో చేయడం విశేషం. తిరుపతి లోక్‌సభ స్థానానికి నామినేషన్ సందర్భంలో దాఖలు చేసిన అఫిడవిట్, ఆయన ఎంతటి సామాన్యుడో చెప్పకనే చెబుతుంది.
గురుమూర్తి కుటుంబ ఆస్తులు మొత్తం 47.25 లక్షలు. ఇందులో గురుమూర్తి వ్యక్తిగత ఆస్తి కేవలం 10 లక్షల 66 వేల 515 రూపాయల విలువైన చరాస్తులునాయి. భార్య నవ్యకిరణ్ పేరుమీద 24 లక్షల 92 వేల 529 విలువైన చరాస్తులు, అలాగే ఆమె పేరుపై 7 లక్షల కారు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.
అలాగే స్వస్థలమైన ఏర్పేడు మండలం మన్నసముద్రంలో తన పేరు మీద 2 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్టు చూపారు. అదే గ్రామంలో ఐదు లక్షల రూపాయల విలువైన 2610 చదరపు అడుగుల్లో సొంత ఇల్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో గురుమూర్తి పేర్కొన్నారు. తన పిల్లలు కార్తికేయ నిక్షాల్ దగ్గర 2.92 లక్షల రూపాయల విలువైన 62 గ్రామలు బంగారం, డెలీనా నిక్షాల్ దగ్గర 3.73 లక్షల రూపాయల విలువైన 83 గ్రాముల బంగారం ఉన్నట్లు వివరాలు వెల్లడించారు.
బహుశా దేశంలో ఓ ఐదారుగురు పేద పార్లమెంట్ సభ్యులుంటే, వారిలో గురుమూర్తి కూడా ఒకరని చెప్పొచ్చు. గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్‌లో ఆయన అడుగు పెట్టి అధికారికంగా ఎంపీ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి పార్లమెంట్ ప్రజానీకం ఆకాంక్షలకు తగినట్టు డాక్టర్ గురుమూర్తి తన గళాన్ని వినిపించాల్సి వుంది.