రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్నపాత్ర పోషించి అడ్డుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని, మరి ఆ పార్టీ దద్దమ్మ పాత్ర పోషిస్తోందా అని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించాడు. ఢిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశమని మరోసారి స్పష్టం చేశాడు. శివరామకృష్ణన్ కమిటీ వద్దని వారించినా గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిందని ఆయన మండిపడ్డాడు.
కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నాడు. కానీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకోలేదన్నాడు. ఇప్పుడు తమను జోక్యం చేసుకోవాలని, పెద్దన్న పాత్ర పోషించాలని అడుగుతున్నారన్నాడు. మరి 23 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అని జీవీఎల్ ప్రశ్నించాడు. హైకోర్టు విషయంలో మొదటి నుంచే కర్నూల్‌లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు గుర్తు చేశాడు. తాము కోరుకున్నట్టే జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుందని, కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.
అమరావతిలో నాలుగేళ్లలో నాలుగు బిల్డింగులు కూడా కట్టని చంద్రబాబు అసమర్థ పాలకుడన్నాడు. చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వమని, అందువల్లే అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయలేదన్నాడు. అమరావతిలో మొదటి ముద్దాయి చంద్రబాబే అన్నాడు. ప్రస్తుతం రాజధాని సంక్షోభానికి టీడీపీ, వైసీపీ బాధ్యత వహించాలన్నాడు.