హై-పవర్ కమిటీ: లోపల చర్చలు.. బైట చాకిరేవు

హై-పవర్ కమిటీ వ్యవహారం అంతా చాలా గుంభనంగా జరుగుతోంది. ఇప్పటికి రెండు భేటీలు పూర్తయినా అసలు విషయం మాత్రం బైటకు రావడంలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు జరిగిన హైపవర్ కమిటీ మీటింగ్ లో…

హై-పవర్ కమిటీ వ్యవహారం అంతా చాలా గుంభనంగా జరుగుతోంది. ఇప్పటికి రెండు భేటీలు పూర్తయినా అసలు విషయం మాత్రం బైటకు రావడంలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు జరిగిన హైపవర్ కమిటీ మీటింగ్ లో సచివాలయ మార్పుపై కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులు, ఇప్పుడు విశాఖకు వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలి అనే విషయంపై కమిటీ సభ్యులు దృష్టిసారించారని తెలుస్తోంది.

ఉద్యోగుల తరలింపు కోసం ప్రభుత్వం ముందస్తు కసరత్తులు చేయాలనే ప్రతిపాదన కమిటీ ముందుకు వచ్చింది. ఉద్యోగులకు హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఇంటి నిర్మాణానికి రుణాలు మంజూరు చేయడం, వారి పిల్లలకు స్కూళ్లలో సీట్ల కేటాయింపుపై కూడా చర్చించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఓ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

మరోవైపు రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులకు కూడా న్యాయం చేయాలని, వారి సమస్యలన్నీ పరిష్కరించాలనే నిర్ణయాలను తీసుకుంది కమిటీ.. అయితే మంత్రులు బైటకొచ్చి మీడియాతో మాట్లాడేటప్పుడు ఈ విషయాలేవీ చెప్పలేదు. లోపల జరిగిన విషయాలన్నీ రహస్యంగానే ఉంచారు. దీనికి విరుద్ధంగా బైటకొచ్చి చంద్రబాబుకి చాకిరేవు పెట్టారు మంత్రులు.

అమరావతి పేరు చెప్పి విదేశాల నుంచి కూడా విరాళాలు సేకరించిన చంద్రబాబు వాటిని దేని కోసం ఖర్చుపెట్టారని ప్రశ్నించారు. అప్పుడు డబ్బులు దండుకుని, ఇప్పుడు మళ్లీ జోలెపట్టి మరోసారి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ ని నిర్బంధించిన చంద్రబాబు, నెలల తరబడి ముద్రగడ పద్మనాభంను ఇంట్లో నుంచి కదలనీయకుండా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అక్రమ అరెస్ట్ లంటూ మాట్లాడటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. 

మొత్తమ్మీద హై పవర్ కమిటీ భేటీ ముగిసిన తర్వాత అనూహ్యంగా కమిటీ సభ్యులు చంద్రబాబుపై విరుచుకుపడటాన్ని ఎవరూ ఊహించలేదు. 13 జిల్లాల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి ఉద్ఘాటించిన కమిటీ సభ్యులు.. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు