పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలకు సంబంధించి హైకోర్టు వరుసగా చేసిన ఘాటు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఎల్లో మీడియా పతాక శీర్షికలయ్యాయంటే ఆ వ్యాఖ్యలు ఎవరికి అనుకూలమో అర్థం చేసుకోవడం సులభం. మరోవైపు హైకోర్టు వ్యాఖ్యలపై కొన్ని వర్గాలు, ప్రాంతాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బహుశా ఈ పరిణామాల గురించి సమాచారమో, మరే కారణమో తెలియదు కానీ, హైకోర్టు అప్రమత్తం అయినట్టు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల చట్టబద్ధతను మాత్రమే తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ రెండు చట్టాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనుసరించిన నిర్ణాయక విధానాన్ని కూడా తేలుస్తామంది. రాజధాని ఏర్పాటుకు ఏ ప్రాంతం అనువైనదన్న అంశం తమకు సంబంధించినది కాదని తేల్చి చెప్పింది. తమ ముందున్నది నగరాల మధ్య పోటీ వివాదం కాదని స్పష్టం చేసింది. అందువల్ల న్యాయవాదులు చట్టాల చట్టబద్ధత గురించే వాదనలు వినిపించాలని హైకోర్టు కోరింది.
పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం చేపట్టిన విచారణలో భాగంగా నాలుగో రోజు కీలక వ్యాఖ్యలు చేసింది.
వ్యాజ్యాల విచారణ సందర్భంగా తాము సరదాగా మాట్లాడుతున్న మాటలు కూడా ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో వాదనల సమయంలో తాము పూర్తిస్థాయి చర్చలోకి వెళ్లలేకపో తున్నామని, ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది. తమ సందేహాలను నివృత్తి చేసుకునే పరిస్థితి ఉండటం లేదని పేర్కొంది.
అమరావతి రాజధానికి రైతులు ఉచితంగా భూములిచ్చారని, వారి ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంతో సమానమని చీఫ్ జస్టిస్ అన్న విషయం తెలిసిందే. అలాగే హైకోర్టు లేకుండా న్యాయరాజధాని ఎలా అవుతుందని చీఫ్ జస్టిస్ ప్రశ్నించడాన్ని ఎల్లో మీడి యాలో పతాక శీర్షికలయ్యాయి. ఇవే కాకుండా మరికొన్ని వ్యాఖ్యలు కూడా అమరావతి రాజధాని ప్రాంత రైతులకు, టీడీపీకి అను కూలంగా ఉన్నాయనే భావన బలంగా ఉంది.
దీంతో రాజధాని అంశంపై తీర్పు ఎలా వుంటుందో ముందే తెలిసిపోయిందనే చర్చకు తెరలేచేలా ఎల్లో బ్యాచ్ ప్రచారం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో రోజు విచారణలో అలాంటి అనుమానాలు, అపోహలకు చెక్ పెట్టేలా చీఫ్ జస్టిస్ తాను సరదాగా అన్న మాటలను మరో రకంగా చిత్రీకరించారనే భావనను వ్యక్తీకరించారు. మరి మున్ముందు చేయబోయే వ్యాఖ్యల ఆధారంగా నిష్పాక్షికతపై చర్చ ఉంటుందని చెప్పక తప్పదు.