జగన్ సర్కార్ చెంప ఛెళ్లుమనిపించేలా హైకోర్టు సీరియస్ వ్యాఖ్యానాలు చేసింది. ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలన సాగించాల్సిన అవసరాన్ని హైకోర్టు చెప్పకనే చెప్పింది. కొన్ని పథకాలు లేదా పనులు చేపట్టేటప్పుడు ప్రతిపక్షాలు, పౌర సమాజం నుంచే వచ్చే సద్విమర్శలను, సూచనలను తీసుకునేందుకు వెనుకాడనవసరం లేదు. సరైన సలహాలు తీసుకుని అమలు పరచడం ద్వారా జగన్ సర్కార్ గౌరవం పెరుగుతుందే తప్ప తరగదు. ప్రతిపక్షాలు వద్దన్నాయి కాబట్టి, మరింత పట్టుదలతో ముందుకు పోతామని మొండి పట్టుదలతో వ్యవహరిస్తే అసలుకే ఎసరు వస్తుందనే సత్యాన్ని గ్రహించాలి.
పంచాయతీ కార్యాలయాలకు అధికార పార్టీ వైసీపీ రంగులు వేయడం, అలాగే ప్రభుత్వ బడుల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడంపై సోమవారం హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వరకు వెళ్లే పరిస్థితులను జగన్ సర్కార్ చేజేతులారా కొని తెచ్చుకొంది.
వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఏమన్నదంటే…
‘ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి వీల్లేదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంచాయతీ కార్యాలయాకు రంగులు వేస్తుంటే మీరేం చేస్తున్నారు ( రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నిలదీసింది). స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం మీ పనే కదా, అందుకే కదా మీరున్నది. రెండు వారాల్లో రంగులను తొలగించాల్సిందే’
ఆంగ్ల మాధ్యమంపై…
‘ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చే చర్యల్లో భాగంగా పాఠ్య పుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు తదితర చర్యలు చేపడితే అధికారులకు ఇబ్బందులు తప్పవు. ఈ వ్యవహారంపై ముందుకెళితే ఆ ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచే రాబడతాం. పూర్తిగా ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉంది’ అని హైకోర్టు సీరియస్‌గా వ్యాఖ్యానించింది.
అసలు పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? రంగులకు ఓట్లు రాలుతాయా? గతంలో ఎన్నడైనా ఏ పాలకులైనా ఇలాంటి పిచ్చిపనులు చేశారా? జగన్ సర్కార్ ఎందుకు విపరీత ధోరణులకు పోతోంది? రంగులు వేయడానికి సుమారు రూ.1500 కోట్లు ఖర్చు అయినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు తిరిగి ఆ రంగులను తొలగించడానికి మళ్లీ అదనపు ఖర్చు. వీటికి తోడు ప్రభుత్వానికి అప్రతిష్ట. ఎందుకీ అనాలోచిత పనులు. ఇలాంటివి తగదని చెప్పే సలహాదారులు కూడా జగన్ సర్కార్‌లో లేరా?
ఇక ఆంగ్ల మాధ్యమం విషయానికి వద్దాం. ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ, ప్రజాసంఘాలు తప్పు పట్టడం లేదు. కాకపోతే తెలుగు మాధ్యమంలో కూడా చదువు కోవాలనుకునే విద్యార్థులకు ఆ అవకాశాన్ని కొనసాగించాలని మాత్రమే అందరి డిమాండ్. కానీ జగన్ సర్కార్ తెలుగు సబ్జెక్ట్‌ను ఉంచుతున్నాం కదా అని చెబుతోంది. మాధ్యమాన్ని కొనసాగించడం వేరు, సబ్జెక్ట్‌ను పెట్టడం వేరు. ఈ విషయంలో జగన్ సర్కార్ అతి తెలివి తేటలు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలపై సమాధానం ఎవరు చెబుతారు? ఆంగ్ల మాధ్యమంపై ముందుకెళితే ఆ ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచే రాబడతామనే హైకోర్టు హెచ్చరికలతో అప్రతిష్ట ఎవరికి? ప్రభుత్వానికా, అధికారులకా?
ఇప్పటికైనా జగన్ సర్కార్ పునరాలోచించాలి. తప్పులను సరిదిద్దుకోవడంలోనే ఎదుగుదల ఉంటుంది. కావున సరైన సూచనలు ఎవరి నుంచి వచ్చినా తీసుకుని ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు వ్యవహరిస్తే….న్యాయస్థానాల్లో మొటిక్కాయలు తినక తప్పదు. మరి హైకోర్టు వ్యాఖ్యలను హూందాగా స్వీకరించి పట్టువిడుపులతో వ్యవహరిస్తే జగన్ సర్కార్కే మంచింది.