సెకెండ్ వేవ్ లో కరోనా మరోసారి కోరలు చాచింది. తెలంగాణతో పాటు హైదరాబాద్ లో కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో క్వారంటైన్ హోటల్స్ కు మరోసారి గిరాకీ పెరిగింది. గతేడాది కరోనాకే భారీగా దోచుకున్న క్వారంటైన్ హోటల్స్.. ఈసారి అంతకుమించి అన్నట్టు వ్యవహరిస్తున్నాయి.
కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు లేదా విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వాళ్లు ఈ క్వారంటైన్ హోటల్స్ ను ఆశ్రయిస్తున్నారు. 2 వారాల పాటు ఈ హోటల్స్ లో ఉన్నందుకు దాదాపు లక్ష రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నాయి కొన్ని హోటల్స్.
అలా అని ఈ హోటల్స్ లగ్జరీలు అందించడం లేదు. కేవలం క్వారంటైన్ పేరిట అరకొర సదుపాయాలతో సౌకర్యాలు అందించి లక్షలు పిండుకుంటున్నాయి. సాధారణంగా సదరు హోటల్స్ లో దొరికే ఆహారాన్ని కూడా ఇవ్వకుండా.. పౌష్టికాహారం పేరిట మెనూ మార్చేసి మరీ డబ్బులు దండుకుంటున్నాయి.
నిజానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్వారంటైన్ నిబంధనల్లేవు. కరోనా పాజిటివ్ వచ్చినా, విదేశీ ప్రయాణాలు చేసి అనుమానం వ్యక్తంచేసినా హోం క్వారంటైన్ లోనే ఉంటున్నారు. కానీ కొంతమంది మాత్రం కుటుంబ సభ్యులకు, ఇంట్లో పెద్దవాళ్లు, చిన్న పిల్లలకు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఇలాంటి హోటల్స్ ను ఆశ్రయించి భారీ మొత్తంలో జేబుకు చిల్లు పెట్టించుకుంటున్నారు.
కొన్ని రోజుల కిందట ఇలానే దుబాయ్ నుంచి ఓ వ్యక్తి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ నుంచి అతడు రాజమండ్రి వెళ్లాలి. కానీ ఎందుకైనా మంచిదని హైదరాబాద్ లోనే ఓ క్వారంటైన్ హోటల్ లో వారం రోజులు ఉన్నాడు. ఆ 7 రోజులకే 60వేల రూపాయల బిల్లు వేసింది ఓ హోటల్. అడిగితే ఆక్సిజన్ సౌకర్యం, 24 గంటలు అందుబాటులో వైద్య నిపుణుడ్ని (డాక్టర్ని కాదు) ఉంచుతున్నామని చెబుతున్నారు.
కరోనాకు సంబంధించి అన్ని విభాగాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ, గైడ్ లైన్స్ ఇస్తున్న ప్రభుత్వాలు క్వారంటైన్ పేరిట దోచుకుంటున్న ఈ హోటళ్లను మాత్రం చూసీచూడనట్టు వదిలేస్తున్నాయి.