వైసీపీ ఎలా ఓడిపోతుంది !?

రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నికలంటే జగన్ భయపడుతున్నారని చిత్తు చిత్తుగా ఓడిపోతామన్న భయంతోనే- ఎన్నికలను అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు కొన్ని రోజులుగా వీరంగం చేయడం చూస్తూనే ఉన్నాం. టీడీపీ అనుకూల విశ్లేషకు లైతే…'శరభ శరభ …'అంటూ…

రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నికలంటే జగన్ భయపడుతున్నారని చిత్తు చిత్తుగా ఓడిపోతామన్న భయంతోనే- ఎన్నికలను అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు కొన్ని రోజులుగా వీరంగం చేయడం చూస్తూనే ఉన్నాం. టీడీపీ అనుకూల విశ్లేషకు లైతే…'శరభ శరభ …'అంటూ వైసీపీపై విరగదీసుకు పడిపోవడాన్ని కూడా చూస్తూనే ఉన్నాం.

ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భావనతో వైసీపీ ప్రభుత్వం-  ఎన్నికల నిర్వహణను వ్యతిరేకించడం లేదు. రాష్ట్ర  ఎన్నికల కమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఒక అంతర్భాగం. ఎన్నికల కమిషన్‌కు సొంత యంత్రాంగం ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం సాయంతోనే అది ఎన్నికలు నిర్వహించాలి.

ప్రభుత్వ యంత్రాంగానికి నేతృత్వం వహించేది, ముఖ్యమంత్రి సారథ్యంలోని మంత్రి వర్గం. ఎన్నికల కమిషన్ అనే దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందని అంటే – ప్రభుత్వ యంత్రాంగం నెత్తి మీద కూర్చుని వీరంగం చేయమని కాదు. ప్రభుత్వ యంత్రాంగ సహకారంతో…సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ- ఎన్నికలను వీలైనంత స్వేచ్ఛగా నిర్వహించమని భావన.

దీని స్ఫూర్తిని ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ గౌరవించలేదని ప్రభుత్వం భావించింది. గతంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే వాయిదా వేసేముందు- కమిషనర్ – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి మాటమాత్రం కూడా చెప్పలేదు. ఆ ప్రవర్తన ప్రభుత్వానికి నచ్చలేదు. దీనివల్ల పెరిగిన దూరాన్ని తగ్గించుకోడానికి కూడా కమిషనర్ కనీస ప్రయత్నం చేయలేదు.

ప్రభుత్వాన్ని- “నువ్వెంత ? నీ లెక్కెంత…?” అన్న రీతిలో వ్యవహరిస్తూ వచ్చారు. చివరకు, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో ఒక ప్రైవేట్ హోట‌ల్‌లో సమావేశం కావడానికి కూడా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వెనుకాడలేదు.

సమాజం, రాష్ట్ర రాజకీయం కూడా నూరు శాతం కులాల వారీగా విడిపోయివున్న ప్రస్తుత పరిస్థితుల్లో- ఈ విధంగా – ఓకే కులానికి చెందిన ముగ్గురూ సమావేశం కావడం అన్నది ఎలాంటి సంకేతాలను పంపాలో…. అటువంటి సంకేతాలను పంపింది.

దీంతో కొద్ది నెలల్లో పదవీ విరమణ చేయనున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్-  తమ పై కత్తి గట్టారని- ఆయనకు వెనుక నుంచి కమ్మ పెద్దలు, చంద్రబాబు నాయుడు వంటి వారు మద్దతు ఇస్తున్నారని ప్రభుత్వం భావించడంలో అసహజం ఏమీ కనిపించడం లేదు.

ఇలా- వివిధ కారణాల వల్ల, రోజు రోజుకూ పెరిగిన దూరం వల్ల, ఆయన పదవీ కాలం ముగిసిపోయే దాకా – స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి- ఎన్నికల కమిషన్ కు సహకరించకూడదని ప్రభుత్వ అభిప్రాయం అయితే అయి ఉండవచ్చు.

నిజానికి, పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. ఇక, ఒక పార్టీ ఓడిపోవడం…ఒక పార్టీ గెలవడం అనే ప్రశ్న ఎక్కడ ఉదయిస్తుంది. 'గెలిచిన వారంతా మా పార్టీ వాళ్లే' అని 1982 లో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు- అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య ప్రకటించారు.

సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబ‌ర్‌లు- పార్టీ గుర్తుల మీద ఎన్నికవ్వరు. స్వంత బలం మీద ఎన్నికవు తారు. అందు వల్ల, ఎన్నికలకు వైసీపీ భయపడే దెక్కడ? ఏమిటీ విశ్లేషణలు…సూత్రీకరణలు?  నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ ఆ పదవిలో ఉండగా- ఆయన అధికార పరిధిలోకి వచ్చే ఎటువంటి ఎన్నికలైనా నిర్వహించడానికి ప్రభుత్వం సుముఖం గా లేదు. ఎన్నికలు నిర్వహించి తీరుతా అని ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేసినట్టుగా వ్యవహరిస్తున్నారు.

పంచాయతీలు 13 వేలకు పైబడి రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ ప్రభుత్వానికి ఇష్టం లేదనే విషయం స్పష్టమైన తరువాత- ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి, చివరకు అటెండర్ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఖాతరు చెయ్యరు. ఎందుకంటే- వారికి ప్రభుత్వమే ముఖ్యం. వారి ఉద్యోగాలే వారికి ముఖ్యం. వారి బతుకు తెరువే వారికి ముఖ్యం. ఎంత మంది ఉద్యోగులపై కమిషనర్ చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు!

భోగాది వేంకట రాయుడు

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్