కరోనా కల్లోలం.. దీనికి ఆడ-మగ తేడాల్లేవు. చిన్న-పెద్ద కనికరం లేదు. ధనిక-పేద అనే తారతమ్యం లేదు. అందర్నీ పట్టి పీడిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు తోడేస్తుంది. అయితే పై వాక్యాన్ని కూడా కొంచెం సవరించాలి.
ఇలాంటి మహమ్మారి నుంచి కూడా ఇండియాలోని ధనవంతులు కొందరు గ్రేట్ ఎస్కేప్ అవుతున్నారు. డబ్బుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు. చాలామంది డబ్బున్నోళ్లు కరోనాకు చిక్కకుండా భలే తప్పించుకుంటున్నారు.
అంబానీ ఇప్పుడెక్కడున్నాడు
దేశంలోనే అందరికంటే ధనవంతుడు ముకేష్ అంబానీ ఇప్పుడెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ముంబయిని కరోనా అతలాకుతలం చేస్తున్న వేళ.. ముకేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి గుజరాత్ లోని జామ్ నగర్ జంప్ అయ్యాడు.
అక్కడ అంబానీకి అతిపెద్ద బంగ్లా ఉంది. కొంతమంది వ్యక్తిగత సిబ్బంది, పని మనుషులతో పాటు అంబానీ అక్కడే ఉంటున్నారు. అంబాని రావడాని కంటే ముందే వీళ్లంతా అక్కడ క్వారంటైన్ లో ఉన్నారు.
ఇప్పుడు కూడా లక్షణాలతో సంబంధం లేకుండా ప్రతిరోజూ వాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. బంగ్లా మొత్తాన్ని ప్రతిరోజూ శానిటైజ్ చేస్తున్నారు. ఇంట్లోకి వచ్చే ప్రతి వస్తువు, పదార్థాన్ని శాస్త్రీయంగా శానిటైజ్ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. ఇలా ప్రపంచానికి, కరోనాకు దూరంగా బయో బబుల్ లో స్వేచ్ఛగా జీవిస్తున్నారు ముకేష్ అంబానీ.
మిగతా ధనవంతులేం చేస్తున్నారు..
దేశంలోనే రెండో ధనవంతుడు గౌతమ్ అదాని కూడా దాదాపు ఇదే పని చేశారు. కొడుకు కరణ్, మరికొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి అహ్మదాబాద్ వెళ్లిపోయారు. అక్కడ సువిశాలమైన భవంతిలో, అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ, హ్యాపీగా తమ బిజినెస్ కార్యకలాపాలు చూసుకుంటున్నారు.
వీళ్లతో పాటు దాదాపు మిగతా మల్టీ మిలియనీర్లు అంతా ఇదే పని చేస్తున్నారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లు ఫామ్ హౌజ్ లు, తమ సొంత రిసార్టులకు వెళ్లి సేదతీరుతున్నారు. వీళ్లు తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలతో కరోనా వచ్చే ఛాన్సే లేదు.
ఈసారి వైద్య సౌకర్యాలు కూడా..
గతేడాది కూడా దాదాపు ధనవంతులంతా ఇదే పనిచేశారు. కాకపోతే ఈసారి వీళ్లు మరింత జాగ్రత్తపడ్డారు. అదెలాగంటే.. బయో బబుల్ లో ఉంటూనే, తమ బంగ్లాల్లో ఐసీయూ సెటప్ పెట్టుకుంటున్నారు. దేశమంతా ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్న వేళ.. వీళ్లు ముందుగానే ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్లు స్టాక్ పెట్టుకున్నారు.
మొన్నటికిమొన్న ఓ ధనవంతుడు తీవ్రమైన కరోనా లక్షణాలతో హాస్పిటల్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించాడు. చేతిలో కోటి రూపాయల క్యాష్ పట్టుకొని తిరిగినా ముంబయిలో అతడికి పెద్ద హాస్పిటల్ లో బెడ్ దొరకలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ధనవంతులు ఇలా ఐసీయూ సెటప్ పెట్టుకున్నారు.
ఇక సౌత్ విషయానికొస్తే.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లోని చాలామంది ప్రముఖులు ఇప్పటికే సిటీస్ వదిలి తమ ఫామ్ హౌజ్ లు, గెస్ట్ హౌజ్ లకు చేరుకున్నారు. క్రితంసారి ఇలానే గడిపిన వీళ్లంతా ఈసారి మరింత కేర్ తీసుకుంటున్నారు. దాదాపు నెల రోజులకు సరిపడ సరుకుల్ని పెట్టుకొని మరీ ఫామ్ హౌజ్ లకు కదిలారు. తమ స్టాఫ్ మొత్తానికి ప్రతి 5 రోజులకు ఒకసారి విధిగా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు.
ఇదంతా ఒకెత్తయితే.. కొంతమంది ధనికులు ఇండియాను వదిలి అమెరికా చెక్కేశారు. 4-5 రెట్లు ఎక్కువ డబ్బు చెల్లించి మరీ టిక్కెట్లు కొనుగోలు చేసి అమెరికాకు జంప్ అయ్యారు. ఇంకొంతమంది ప్రముఖులు తమ ఇంటినే బయోబబుల్ గా మార్చేశారు. పనిమనుషులకు ఔట్ హౌజ్ లో ఏర్పాట్లు చేసి వాళ్లను కూడా తమతో పాటు ఉండేలా చూసుకుంటున్నారు.
చాలామంది టాలీవుడ్ ప్రముఖులు తమ ఇంటి బయట పలు రకాల శానిటైజేషన్ మెషీన్లను ఏర్పాటుచేసుకున్నారు. ఎలాంటి వస్తువునైనా శానిటైజ్ చేసిన తర్వాత ఇంట్లోకి రానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ధనికులు ఇప్పుడు ఇళ్లు కదలడం లేదు. తమ ఇంటినే బయో బబుల్ గా మార్చేసి కాలక్షేపం చేస్తున్నారు. అన్ని చర్యలు, సకల హంగుల్ని ఇంటిముందుకే రప్పించుకుంటున్నారు.
ఓవైపు సామాన్యుడు కరోనాతో జీవన్మరణ పోరాటం చేస్తుంటే.. మరోవైపు ఇండియాలోని ధనికులు ఇలా తమ డబ్బుతో, సకల ఏర్పాట్లు కల్పించుకొని కరోనాను కాస్ట్ లీగా ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లూ సామాన్యుడు బతకడానికి మాత్రమే క్యూ కట్టాడు. ఇప్పుడు చావడానికి, చితి మంటకు సైతం క్యూ కట్టే దుర్భర పరిస్థితి. చివరికి దహన సంస్కారాలకు చాలినన్ని కట్టెలు కూడా దొరకని దయనీయ స్థితి.
దేశానికి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ధనిక-పేద తేడాలు ఉండవంటారు. కానీ ఈసారి మాత్రం పేదల కంటే ధనవంతులకు తప్పించుకోవడానికి ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడా తేడా కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది.