తమను ఓడించి తీరుతామని ప్రతినబూనిన బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ తన అభ్యర్థిని ఎంపిక చేసింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ను హుజూరాబాద్ అభ్యర్థిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రకటించారు.
ఇక్కడ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది. రెండు పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ఇక తండ్లాటే తరువాయి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ప్రకటించడంతో ఆయన గురించి ఆరా తీయడం మొదలైంది. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా గెల్లు అనేకసార్లు జైలుపాలయ్యారు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌ను నిలపాలని కేసీఆర్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇక్కడ గెలవాలనే ఆశ, పట్టుదల ఆ పార్టీలో కనిపించడం లేదు. పరువు కోసం పోటీ అన్నట్టుగా హుజూరాబాద్ ఎన్నికను కాంగ్రెస్ పరిగణిస్తోంది. మరోవైపు ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక ఇచ్చిన జోష్‌తో హుజూరాబాద్‌లో కూడా సత్తా చాటాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం. ఎన్నికలు సమీపిస్తే… హుజూరాబాద్ ఓ రణక్షేత్రాన్ని తలపించేలా సంగ్రామం ఉంటుందని చెప్పక తప్పదు.