అసలు హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల విషయంలో రేవంత్ రెడ్డి కామెంట్ చేయడమే చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ఆదేశాల ప్రకారం ఎంపీగా పోటీ చేయడంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. అలాంటి సీటు విషయంలో, ఆ సీటు నుంచి ఇదివరకూ నెగ్గిన ఉత్తమ్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అవుతుందని ఎవరైనా అనుకుంటారు. కాంగ్రెస్ లోనే కాదు.. ఏ పార్టీలో అయినా అలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసిన నేత మాటే ఫైనల్ కావాల్సి ఉంటుంది. అయితే ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి అలా మాట్లాడేసి రచ్చరేపారు.
మరి అంత రచ్చ రేపీ చివరకు ఏమీ సాధించలేకపోయారు రేవంత్. హుజూర్ నగర్ అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా ప్రకటించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేసేశారు కూడా. అయితే సోనియాగాంధీ పేరిట వెలువడిన నిర్ణయం ప్రకారం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిని అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు.
కాంగ్రెస్ తరఫున ఆమె అభ్యర్థిత్వానికే ఓకే చెప్పారట సోనియా! ఉత్తమ్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలంటూ రేవంత్ డిమాండ్ చేస్తే, ఆయన భార్యకు టికెట్ ఖరారు చేశారట సోనియాగాంధీ. ఇలాంటి నేపథ్యంలో… రేవంత్ రెడ్డికి ఎలాంటి అనుభవం ఎదురైందో వేరే చెప్పనక్కర్లేదని అంటున్నారు పరిశీలకులు.
తనకు సంబంధం లేని వ్యవహారంలో తలదూర్చి, ఎవరికో టికెట్ ఇప్పించాలని చూసి.. రేవంత్ రెడ్డి ఎదురుదెబ్బ తిన్నారు. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండాలని అనుకోవడం లేదని, ఆయన చూపు బీజేపీ వైపు మళ్లిందని.. చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన బీజేపీలోకి చేరబోతున్నారని కూడా ఒక టాక్ నడుస్తూ ఉండటం గమనార్హం!