అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తి పల్లంకొండ రాజు గుర్తుల్ని పోలీసులు విడుదల చేశారు. తప్పించుకొని తిరుగుతున్న ఈ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సంచలన కీలక నిర్ణయం తీసుకున్నారు. అతడ్ని పట్టిస్తే 10 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. ఈమధ్య కాలంలో హైదరాబాద్ పోలీసులు ఇంత మొత్తంలో రివార్డ్ ప్రకటించడం ఇదే తొలిసారి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును సభ్యసమాజం తీవ్రంగా ఖండించింది. సినీ, రాజకీయ ప్రముఖులు తన నిరసనను తెలిపారు. కామాంధుడ్ని పట్టుకునేందుకు సినీ ప్రముఖులంతా రాజు ఫొటోను, పోలీసుల స్టేట్ మెంట్ ను షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. పాప కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అటు పోలీసులు కూడా రాజు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 10 బృందాలుగా ఏర్పడి 4 రోజులుగా వెదుకుతున్నారు. అయినప్పటికీ రాజు దొరకలేదు. పోలీసులు ప్రకటించిన ఆనవాళ్లు ప్రకారం.. రాజు చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు వేయించుకున్నాడు. వాడికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఫుల్ గా తాగి ఫుట్ పాత్ పై ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడు.
నిందితుడికి సంబంధించిన ఓ వీడియోను కూడా పోలీసులు విడుదల చేశారు. 5.9 అడుగుల ఎత్తు ఉంటాడని చెబుతున్నారు. అతి త్వరలో కామాంధుడ్ని పట్టుకొని అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు. వాడు ఎక్కడ దొరికితే అక్కడ స్పాట్ లో ఎన్ కౌంటర్ చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి.