కరోనా వ్యాక్సిన్ ను ఇప్పటికే ఆవిష్కరించినట్టుగా, త్వరలోనే హ్యూమన్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని ఈ ఏడాది భారత స్వతంత్రదినోత్సవం రోజుకు అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో విమర్శలు వెంటనే మొదలయ్యాయి. హ్యూమన్ ట్రయల్స్ అంటే అది రాత్రికి రాత్రి జరిగే పని కాదని, సుదీర్ఘ పరిశీలనలు అవసరం ఉంటుందుందని.. అలాంటిది ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుందని ఐసీఎంఆర్ ఏ విధంగా చెబుతుంది? అని అనేక మంది ప్రశ్నించ సాగారు.
ఇంత త్వరగా హ్యూమన్ ట్రయల్స్ పూర్తి కావడం సాధ్యం కాదని వారు అంటూ ఉన్నారు. ఐసీఎంఆర్ మాజీ చీఫ్ ఒకరు కూడా ఇదే మాటే చెప్పారు. హ్యూమన్ ట్రయల్స్ సుదీర్ఘ సమయం తీసుకుంటుందని ఆయన తేల్చారు. అలాగే ఇప్పటికే వ్యాక్సిన్ ను ఆవిష్కరించినట్టుగా ప్రకటించిన బ్రిటన్ వర్సిటీ కూడా.. ఆక్టోబర్ నాటికి హ్యూమన్ ట్రయల్స్ పూర్తవుతాయని చెబుతోంది. ఇక డబ్ల్యూహెచ్వో అయితే.. మరో ఏడాది పడుతుందని చెబుతోంది! ఇలా ఎవరి అభిప్రాయాలను వారు చెబుతూ వస్తున్నారు.
ఈ అంశాలపై ఐసీఎంఆర్ స్పందించింది. తమను తక్కువ అంచనా వేయొద్దు అన్నట్టుగా ఉంది ఆ సంస్థ చేసిన ప్రకటన. అంతర్జాతీయ ప్రమాణాలను పాటించే తాము వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా ఆ సంస్థ చెబుతూ ఉంది. జంతువుల మీద, మనుషుల మీద ప్రయోగాలను సమాంతరంగా సాగిస్తున్నట్టుగా.. ఆగస్టు 15 నిటికి వ్యాక్సిన్ అందుబాటులోఇక వచ్చి తీరుతుందన్నట్టుగా ఐసీఎంఆర్ ప్రతినిధులు తేల్చి చెబుతూ ఉన్నారు. తమపై వచ్చిన విమర్శల జడి తర్వాత ఈ రకంగా స్పందిస్తూ ఉన్నారు. తమను తక్కువ అంచనా వేయొద్దని స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. నిఖార్సైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. ఐసీఎంఆర్ ఛాంపియన్ గా నిలుస్తుంది.