ఒకవైపు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు సెమిస్ లోకి ఎంట్రీ ఇచ్చి చరిత్రను రిపీట్ చేయగా, మరోవైపు మహిళల హాకీ జట్టు చరిత్రలో తొలి సారి ఒలింపిక్స్ సెమిస్ కు చేరి సంచలనం రేపింది. సమీకరణాల ఆధారంగా క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత మహిళా జట్టు.. క్వార్టర్స్ లో మైటీ ఆస్ట్రేలియన్ విమెన్ టీమ్ ను ఓడించి సెమిస్ కు చేరింది. 1-0 గోల్స్ తేడాతో టీమిండియా ఈ విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్ కు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు భారత మహిళలు తమ ప్రదర్శనతో షాకిచ్చారు. అండర్ డాగ్ బరిలోకి దిగిన భారత జట్టు.. సెమిస్ కు చేరి పతకంపై ఆశలు రేపుతోంది. కనీసం ఒక పతకానికి మరో విజయం దూరంలో ఉంది భారత జట్టు.
హాకీలో భారత్ ఒలింపిక్స్ లో చివరి సారి 1980లో పతకం సాధించింది. పురుషుల హాకీ జట్టు ఆ పతకాన్ని సాధించింది. అయితే.. ఆ తర్వాత హాకీలో ఇండియాది ఫెయిల్యూర్ స్టోరీగానే కొనసాగుతూ వచ్చింది. పురుషుల విభాగంలో కూడా కనీసం సెమిస్ కు చేరడం నాలుగు దశాబ్దాల పాటు సాధ్యం కాలేదంటే.. ఇప్పుడు సాధించిన విజయం ఎంత గొప్పదో చెప్పవచ్చు.
ఇక మహిళల జట్టు గత కొన్నేళ్లుగా మెరుగైన ప్రదర్శనను చూపిస్తూ వచ్చింది. ఇప్పుడు భారత మహిళలు హాకీలో సాధించిన విజయాన్ని కేవలం సంచలనంగా చూడవద్దని ఎనలిస్టులు అంటున్నారు. మూడేళ్ల కిందట ప్రపంచకప్ హాకీలో కూడా ఇండియా మెరుగైన ప్రదర్శన చూపించిందని గుర్తు చేస్తున్నారు.
సునాయస విజయం సాధిస్తామనుకున్న ఆస్ట్రేలియన్ టీమ్ ఈ ఓటమితో ఖంగుతింది. 1-0 తేడాతో మ్యాచ్ ఓడిపోవడంతో ఆస్ట్రేలియన్ మహిళా జట్టు కన్నీటి పర్యంతం అయ్యింది. మ్యాచ్ లో నమోదైన ఏకైక గోల్ పెనాల్టీ ద్వారానే భారత్ కు దక్కింది. ఆస్ట్రేలియాకు ఏడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కినా, వాటన్నింటినీ భారత జట్టు అడ్డుకుంది! భారత డిఫెన్స్ ఆ ప్రయత్నాలను అడ్డుకుని ఆధిక్యతను మ్యాచ్ ఆసాంతం కొనసాగింది. తొలి క్వార్టర్ నుంచినే భారత మహిళలు బంతిపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించారు. రెండో క్వార్టర్ లో పెనాల్టీ అవకాశాన్ని గోల్ గా మలిచారు. ఆ తర్వాతి రెండు క్వార్టర్లలో ఆస్ట్రేలియాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, విజయాన్ని నమోదు చేసి, చరిత్రలో తొలిసారి సెమిస్ ఎంట్రీ ఇచ్చారు.