అమరావతి భూములపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. గతంలో అమరావతి భూములపై సీఐడీ, సిట్ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తును నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అమరావతి భూముల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని, విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ముఖ్యంగా ఇందులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రధాన నిందితుడు కావడం కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగగా, ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపించారు.
అమరావతిలో రాజధాని పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై సీబీఐ లేదా రిటైర్డ్ జడ్జి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రాజీవ్ ధావన్ గట్టిగా వాదించారు. ఈ కేసుపై లోతైన విచారణ నిమిత్తం హైకోర్టుకు పంపాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడం గమనార్హం.
వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. అమరావతి భూముల అక్రమాలపై సర్వోన్నత న్యాయ స్థానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఒకవైపు ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో భారీ అక్రమాలు జరిగాయంటూ ఆధారాలతో సహా అసెంబ్లీలో చెప్పిన సంగతి తెలిసిందే.
మరోవైపు రాజధానిలో అక్రమాలపై ప్రభుత్వం కేవలం ఆరోపణ లకే పరిమితమైందని చెబుతూ వచ్చిన నాటి అధికార పార్టీ టీడీపీ …తీరా దర్యాప్తు అనేసరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విమర్శలకు తావిచ్చింది. దర్యాప్తు ఎదుర్కొని మచ్చలేని పాలన సాగించినట్టు నిరూపించుకోవాలనే డిమాండ్‌ను ప్రస్తుత ప్రతిపక్షం అసలు పట్టించుకోలేదు.