ఉత్తరాంధ్రా రాజకీయాల్లో కొన్నిదశాబ్దాలుగా వెలిగిన కుటుంబం అది. ఒక సామాన్య కరణం స్థాయి నుంచి దేశ అత్యున్నత వేదిక పార్లమెంట్ సభ్యుడి దాకా ఎదిగిన చరిత్ర స్వర్గీయ ద్రోణం రాజు సత్యనారాయణది. ఆయన మంత్రి పదవి తప్ప అన్నింటినీ అనుభవించారు. ఆయన లోక్ సభ, రాజ్యసభ రెండింటా సభ్యుడిగా ఎన్నికై అప్పట్లో రికార్డు క్రియేట్ చేశారు.
ఇక ద్రోణం రాజు సత్యనారాయణ 2004లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చనిపోతే ఆయన వారసుడిగా కుమారుడు శ్రీనివాస్ రంగ ప్రవేశం చేశారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ ఏలుబడిలో వీఎమ్మార్డీయే తొలి చైర్మన్ గా నియమితులై చరిత్ర సృష్టించారు. ఇక ఆయన గత ఏడాది అక్టోబర్ లో కరోనాతో చనిపోయారు. ఆయన ప్రధమ వర్ధంతి వేళ చాలా మంది ప్రముఖులు హాజరై నివాళి అర్పించారు.
ఉత్తరాంధ్రా రాజకీయాల్లో ఒక విశ్వవిద్యాలయంగా మారి ఎందరినో తీర్చిదిద్దిన ద్రోణం రాజు కుటుంబానికి న్యాయం చేయాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కోరారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.
మొత్తం బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రముఖులతో పాటు వైసీపీ నేతలు అంతా హాజరైన ఈ కార్యక్రమంలో ద్రోణం రాజు మూడవ తరం వారసుడు శ్రీవాత్సవకు సరైన అవకాశం ఇవ్వాలని తీర్మానించారు. మరి విశాఖ వైసీపీకి అతి ముఖ్య కార్యక్షేత్రంగా ఉంది. వైసీపీ పెద్దలు ఈ రాజకీయ కుటుంబానికి ఏ రకమైన పదవులు ఇస్తారో చూడాలి.