ఒకవైపు కరోనా మూడో వేవ్ గురించి ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రెండో వేవ్ సద్దుమణగనే లేదు. ఇప్పటికీ 40 వేల స్థాయిలో రోజువారీ కేసులు వస్తున్నాయి. ఆగస్టులోనే మూడో వేవ్ మొదలు కావొచ్చని ఇది వరకూ కొందరు పరిశోధకులు తమ అంచనాలను వ్యక్త పరిచారు. ఆగస్టులోనే కాకపోయినా.. ఈ ఏడాది అక్టోబర్ లో అయినా కరోనా మూడో వేవ్ ఉంటుందని పలు అంచనాలున్నాయి. ఇక ఈ అంశం గురించి ఎన్నో ఆందోళనకరమైన అంచనాలే ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఐటీ కంపెనీలు పిలుపులు ఆసక్తిదాయకంగా మారాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ లను ముగించి, వర్క్ ఫ్రమ్ ఆఫీసులకు సన్నద్ధం కావాలన్నట్టుగా ఉన్నాయి పలు ఐటీ కంపెనీల పిలుపులు. ప్రత్యేకించి మూడు రోజుల క్రితం ఇన్ఫోసిస్ జారీ చేసిన మెమో ఒకటి చర్చనీయాంశంగా మారింది. తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలుస్తోంది ఇన్ఫోసిస్.
కేవలం ఇన్ఫోసిస్ మాత్రమే కాదు, కొన్ని ఇతర కంపెనీలు కూడా వ్యాక్సినేషన్ గురించి తమ ఉద్యోగుల వద్ద ఆరా తీస్తున్నాయి. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందా? అంటూ తమ ఉద్యోగుల నుంచినే అవి ఆరాలు తీస్తున్నాయి! టెక్ మహీంద్రా తదితర కంపెనీలు ఈ పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పలు ఐటీ కంపెనీలు వ్యాక్సినేషన్ విషయంలో తామే చొరవ చూపుతున్నాయి. దగ్గరుండి వ్యాక్సిన్లను వేయిస్తున్నాయి.
రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తవ్వడం మీదే ఇప్పుడు కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. వ్యాక్సినేషన్ పూర్తయితే ఇక అంతా సేఫే కదా.. అని అంటున్నాయి కంపెనీలు. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వాళ్లు ఎంచక్కా ఇక సామూహికంగా కూర్చుని పనులు చేసుకోవచ్చు కదా అనే మాట వినిపిస్తోంది కంపెనీల నుంచి. అలాగే ఉద్యోగులే ఆఫీసుకు వస్తామంటున్నారని కూడా కంపెనీలు చెబుతున్నాయి. టీమ్ మేనేజర్లు వర్క్ ఫ్రమ్ ఆఫీసు నే సపోర్ట్ చేస్తున్నారని, అందుకే వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగులు ఆఫీసుకు హాజరవ్వడానికి తగిన ఏర్పాట్లకు సన్నద్ధం అవుతున్నట్టుగా కంపెనీలు చెబుతున్నాయి.
అయితే కొన్ని ఎంఎన్సీ లు మాత్రం ఇప్పుడప్పుడే ఉద్యోగులను ఆఫీసుకు పిలవం అని స్పష్టం చేస్తున్నాయి. ఏదేమైనా థర్డ్ వేవ్ అంచనాల మధ్యనే కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం ముగించి, ఆఫీసుకు రెడీ కావాలనే సంకేతాలను ఇస్తుండటం ఆసక్తిదాయకం. కరోనా విషయంలో ధైర్యం పెరిగిందో, వ్యాక్సినేషన్ కాన్ఫిడెన్స్ ను ఇస్తోందో మరి!