అనుకున్నది సాధిస్తున్న జగన్.. ఇక కోర్టుతో పనేంటి?

ఏపీ హైకోర్టులో ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని పదేపదే చెప్పుకుంటూ చంకలు గుద్దుకుంటోంది టీడీపీ. కొంతమేర అది నిజం కూడా.  Advertisement తుది తీర్పుల కంటే.. స్టేలు, జీవోల కొట్టివేతల్ని హైలెట్…

ఏపీ హైకోర్టులో ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని పదేపదే చెప్పుకుంటూ చంకలు గుద్దుకుంటోంది టీడీపీ. కొంతమేర అది నిజం కూడా. 

తుది తీర్పుల కంటే.. స్టేలు, జీవోల కొట్టివేతల్ని హైలెట్ చేసుకుంటూ టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంతో ప్రజలు కూడా కోర్టుల్లో జగన్ కి ఎదురుదెబ్బ తగిలిందని అనుకోవడం కూడా సహజమే. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ అసలు విషయాన్ని మరచిపోతోంది. 

కోర్టుకు వెళ్లి టీడీపీ స్టేలు తెచ్చుకుంటున్నా.. గతంలో వాళ్లు చేసిన తప్పుల్ని, చేసిన కుంభకోణాల్ని ప్రజల ముందుంచడంలో మాత్రం జగన్ పూర్తిగా సక్సెస్ అయ్యారు, అవుతూనే ఉన్నారు.

అమరావతి వ్యవహారం, సీఆర్డీఏ లీలలు, విశాఖ భూ ఆక్రమణలు, ఈఎస్ఐ అచ్చెన్నాయుడు.. ఇలా చాలా కేసుల్లో కోర్టుల ద్వారా టీడీపీ నేతలు స్టేలు తెచ్చుకున్నారు. మాజీ మంత్రులు బెయిల్ పై బయట తిరుగుతున్నారు. 

అంతమాత్రానికే వారంతా విజేతలుగా ఫోజులివ్వడం ఇక్కడ విశేషం. కానీ జగన్ కు కావాల్సింది కోర్టుల్లో ఏం జరుగుతోందన్నది కాదు. సదరు వ్యక్తుల్ని, వాళ్లు చేసిన పనుల్ని ప్రజల ముందుంచుతున్నామా లేదా అనేది. ఈ విషయంలో జగన్ వందశాతం సక్సెస్ అయ్యారు.

ఆరోపణలు వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలు కక్షసాధింపు అంటారు. ఈ ''రాజకీయ కక్ష సాధింపు'' అనే పదాన్ని ప్రారంభంలో ప్రజలు నమ్మారు కూడా. కానీ ఎప్పుడైతే జగన్ అవినీతి వివరాల్ని ప్రజల ముందుంచుతున్నారో, పచ్చ బ్యాచ్ ఆరోపణల్ని ప్రజలు పట్టించుకోవడం మానేశారు. 

కోర్టులో సదరు కేసుల్లో తీర్పులు ఎలా వస్తాయనే విషయం పక్కనపెడితే.. వెలుగుచూసిన కుంభకోణాలు, కబ్జాలు, అక్రమాల్లో టీడీపీ నేతల హస్తం గురించి ప్రజలకు తెలిసొచ్చింది. జగన్ కు కావాల్సింది ఇదే.

విశాఖలో భూముల కుంభకోణాన్ని తీసుకుంటే, టీడీపీ నేతల చేతుల్లో 5వేల కోట్ల రూపాయల విలువైన భూములున్నాయనే విషయాన్ని జగన్ సర్కార్ ప్రజల ముందు ఉంచగలిగింది. అమరావతి ప్రాంతంలో భూములు లోకేష్, చంద్రబాబు బంధువులు, అనుచరుల చేతుల్లో ఉన్నాయనే విషయాన్ని రిజిస్ట్రేషన్ నంబర్లతో పాటు అసెంబ్లీలో బయటపెట్టింది.

ఈఎస్ఐ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రజలకు చెప్పగలిగింది. ఫైబర్ గ్రిడ్ లో వేల కోట్ల రూపాయలు చేతులు మారయనే విషయాన్ని ప్రజల చెవుల్లో పడేలా చేసింది. రివర్స్ టెండరింగ్ తో అప్పట్లో జరిగిన అక్రమ చెల్లింపులన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి. 

కోర్టుల్లో కేసులన్నీ ఎటు పోతాయనే విషయం పక్కనపెడితే, ఇప్పటికిప్పుడు టీడీపీ నేతలకు, ఈ కేసులకు మధ్య ఉన్న సంబంధాన్ని, తెరవెనక జరిగిన లీలల్ని ప్రజల ముందు ఉంచడంలో మాత్రం జగన్ సర్కారు పూర్తి విజయం సాధించింది.

కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా, ఆయా అంశాలపై ప్రజల్లో చర్చ జరగాలని జగన్ కోరుకున్నారు. అదే ఇప్పుడు జరుగుతోంది. అలా జగన్ తను అనుకున్నది సాధించగలిగారు. నిజానికి ప్రజాసంకల్ప యాత్రలో, ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పింది కూడా ఇదే.