హద్దులు, సరిహద్దులు ఎపుడూ వివాదాలను రాజేస్తూనే ఉంటాయి. అది దేశాలైనా రాష్ట్రాలైనా, జిల్లాలైనా కూడా ఇదే కధ సాగుతుంటుంది. ఇక ఏపీ విషయానికి వస్తే నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటోంది. కర్నాటక, తమిళనాడు, ఒడిషాలతో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఇక తెలంగాణా ఏర్పాటు కావడంతో అక్కడ నుంచి కూడా కొత్త సమస్యలు ఉన్నాయి.
ఇవన్నీ ఇలా ఉంటే ఒడిషా రాష్ట్రంగా ఏర్పాటయ్యాక తెలుగు జిల్లాలు కొన్ని వెళ్ళి అందులో కలిశాయి. వాటి విషయంలో గొడవలు అపుడపుడు వస్తూనే ఉన్నాయి. మరో వైపు రెండు రాష్ట్రలా మధ్య పారుతున్న వంశధార నది మీద కట్టడాల కోసం సమస్యలు ఉన్నాయి.
ఇవిలా ఉంటే కొటియా గ్రామాలు ఇపుడు రెండు రాష్ట్రాల మధ్య కొత్త చిచ్చు రేపుతున్నాయి. నిజానికి ఇది పాత సమస్యే కానీ నాటి పాలకులు పట్టించుకోలేదు. అయితే జగన్ సీఎం అయ్యాక కొటియా గ్రామాలను కూడా ఏపీలో భాగంగా చూస్తున్నారు. అక్కడ కూడా అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు.
దీంతో ఇపుడు ఒడిషా ముందుకు వస్తోంది. అవి మా గ్రామాలు అంటోంది. దీని మీద సుప్రీం కోర్టు దాకా గతంలో రెండు ప్రభుత్వాలు వెళ్లాయి. కానీ రెండు రాష్ట్రాలు కూర్చుని సమస్య పరిష్కరించుకోవాలని తీర్పు వచ్చింది. అయినా కూడా సమస్య అలాగే ఉంది.
ఇపుడు జగన్ దూకుడు తో కొటియా గ్రామాల విషయంలో ఒడిషాకు తపోభంగం అయింది. దాంతో చర్చలకు వస్తోంది. మొత్తానికి కేంద్ర మంత్రి, బీజేపీకి చెందిన ధర్మేంద్ర ప్రధాన్ దీని మీద చొరవ చూపుతున్నారు. మరి సానుకూలంగా కొటియా గ్రామాల సమస్యను జగన్ పరిష్కరిస్తే మాత్రం ఆయనకి తిరుగులేదు అంటున్నారు. చూడాలి మరి.