రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి. కొందరు అరిచి గోల చేస్తారు. కొందరు మౌనంగా ఉంటారు. కొందరు లాబీయింగ్ నడుపుతారు. కొందరు పోరాటాలు చేస్తారు. కొందరు చూద్దాం …చేద్దాం అంటారు. పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉండగా ఎంత పెద్ద సమస్య వచ్చినా మౌనంగా ఉండేవారు. అదీ ఒక విధమైన రాజకీయమే అనేవారు కొందరు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇలాంటి రాజకీయమే చేస్తున్నాడు. ప్రజల తరపున పోరాడటం కంటే తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే ఆయనకు ప్రధానం. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఒకమాదిరిగా వ్యవహరిస్తే, అధికారంలోకి వచ్చాక మరో విధంగా వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల్లో విఫలమయ్యాడనేకదా ప్రజలు జగన్ కు అధికారం అప్పగించారు.
కానీ చంద్రబాబు వైఫల్యాలను జగన్ విజయాలుగా మార్చలేదు. ఏపీ దుస్థితికి చంద్రబాబే కారణమంటూ చేతులు దులుపుకుంటున్నాడు. చంద్రబాబు సాధించలేనివి తాను సాధించాలనే ఉద్దేశంతోనే ప్రజలు తనకు అధికారాన్ని అప్పగించారనే సంగతి జగన్ మర్చిపోయాడు. ఏడేళ్లుగా విభజన సమస్యలను కేంద్రం పరిష్కరించలేదని తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు చెప్పాడు.
ప్రత్యేక హోదా సహా అన్ని సమస్యలు పరిష్కరించాలని అమిత్ షా కు విజ్ఞప్తి చేశాడు. వాస్తవానికి జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయన పోరాడిన కీలక సమస్య ప్రత్యేక హోదా. తనకు అధికారం అప్పగిస్తే కేంద్రం మెడలు వంచి దాన్ని సాధించి తీరుతానన్నాడు.
జగన్ ఆశించినదానికంటే ఎక్కువమంది ఎంపీలను ప్రజలు గెలిపించారు. కాని కేంద్రంలో ఎన్డీయే ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంది కాబట్టి మనమేం చేయలేమని చేతులెత్తేశాడు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబుతో వీరలెవెల్లో పోరాడిన జగన్ అధికారంలోకి వచ్చాక మౌనంగా ఉండిపోయాడు.
కేవలం ప్రత్యేక హోదా ఇవ్వండి అనే విజ్ఞప్తికి పరిమితమయ్యాడు. కేంద్రం హోదా ఇవ్వదనే సంగతి జగన్ కు తెలుసు. కానీ తాను ప్రయత్నిస్తూనే ఉన్నానని ప్రజలను నమ్మించడం కోసం హోదా గురించి అడుగుతూనే ఉన్నానని చెబుతున్నాడు. అంటే తన ప్రయోజనాలు తాను చూసుకుంటున్నాడు తప్ప హోదా సాధన పట్ల చిత్తశుద్ధి లేదనుకోవాలి.
దాని సాధన కోసం తానేమీ ప్రయత్నాలు చేయలేదు. సరే …. హోదా రాకపోతే పోయింది. ఏపీ అభివృద్ధి కోసం తాను కష్టపడి పనిచేస్తున్నాడా ? అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడా అంటే అదీ లేదు. సంక్షేమం పేరుతొ డబ్బులు విదిలిస్తే ప్రజలు మళ్ళీ గెలిపిస్తారనే భావనలో ఉన్నాడు జగన్. ఆయన అప్పుచేసి పప్పుకూడు పెట్టినంత కాలం ప్రజలూ గమ్మున ఉండిపోతారు.