నిన్న వైసీపీ ఎంపీ విజయసాయి, నేడు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ…మూడు రాజధానులపై ఒకే మాట, ఒకే బాట అన్నట్టు మాట్లాడారు. దీని వెనుక ప్రభుత్వ వ్యూహం ఏమై ఉంటుందబ్బా అనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడి నుంచైనా పాలన సాగించొచ్చని నిన్న విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. కనీసం ఒకరోజు కూడా గడవకనే మంత్రి బొత్స సత్యనారాయణ అదే మాటను పునరుద్ఘాటించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులపై కీలక కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చన్నారు. ఈ ఏడాదని కాకుండా ఏ క్షణమైనా ఈ రాజధానులు ఏర్పాటు అవుతాయని ఆయన కుండబద్దలు కొట్టారు. వీటికి సంబంధించిన పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
మూడు రాజధానులపై అసెంబ్లీలో చట్టం చేశామని చెప్పారు. కొందరు కావాలనే కోర్టులకు వెళ్లి ఆలస్యం చేశారని అన్నారు. అడ్డంకులను అధిగమించి త్వరలోనే అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని చెప్పారు.
న్యాయస్థానాల్లో అడ్డంకులను త్వరలోనే అధిగమిస్తామని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటును కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని మంత్రి బొత్స మండిపడ్డారు. శాసనసభలో ఏ చట్టం చేశామో అదే జరిగి తీరుతుందని బొత్స స్పష్టం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు తరువాత సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని ఆయన తేల్చి చెప్పారు.
అమరావతి నుంచి రాజధాని వెళ్లకూడదని టీడీపీ నేతల కోరిక అని, వాళ్లది పైశాచిక ఆనందమని బొత్స అన్నారు. రాష్ట్రలో అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలన్నదే తమ విధానమని మంత్రి అన్నారు. సీఎం ఎక్కడినుంచైనా పాలన చేయొచ్చని పేర్కొన్నారు. రాజ్యాంగం, చట్టాన్ని గౌరవిస్తూ ముందుకెళ్తామని బొత్స తెలిపారు.
విశాఖపట్నం పరిపాలన రాజధాని విషయంలో ఎందుకు సందేహాలు వస్తున్నాయని బొత్స ప్రశ్నించడం గమనార్హం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తమ పార్టీ, సీఎం వైఎస్ జగన్ సంకల్పం అని బొత్స మరోసారి గుర్తుచేశారు. ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, విశాఖ పరిపాలన రాజధానిగా తాము ఏదైతే చెప్పామో అది జరిగి తీరుతుందని బొత్స స్పష్టం చేశారు.
వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా మూడు రాజధానుల అంశంపై మాట్లాడుతున్నారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం వెనక్కి తగ్గేదే లేదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. దీంతో టీడీపీ నేతలకు ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి.