ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కసారి కమిట్ అయితే ఇంకెవరి మాట వినరని ప్రచారంలో ఉంది. అంతెందుకు ఆయన మాటే ఆయన వినరని అందరూ చెప్పేమాట. మాట ఇచ్చేముందు ఆలోచించాలే గానీ, మాట ఇచ్చినాక ఆలోచించేదేముంది అని వైఎస్సార్ పాత్రధారి సినిమాలో ఓ డైలాగ్ చెప్పినట్టు…నిర్ణయం తీసుకోడానికి ముందు ఒకటికి పది సార్లు జగన్ ఆలోచిస్తారు.
ఇక నిర్ణయం తీసుకున్న తర్వాత….దాన్ని ఎలా అమలు చేయాలని మాత్రమే జగన్ ఆలోచించడమే కాకుండా దృష్టి పెడతారని ఆయన్ను దగ్గరగా చూసిన వాళ్లు చెప్పే మాట.
ఏపీలో మూడు రాజధానుల ముచ్చట కూడా అంతే. జగన్ బాగా ఆలోచించి అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల కాన్సెఫ్ట్‌ను జగన్ సర్కార్ తెర మీదకు తెచ్చింది. విశాఖలో పరిపాలన రాజధాని , అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో జగన్ ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టు చట్టాలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యవహారం న్యాయస్థానంలో ఉంది.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై జాతీయ మీడియాతో సీఎం జగన్ తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పారు. పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని జగన్ స్పష్టం చేశారు. అలా చేస్తే ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.
కానీ తన ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని, అందుకు తగ్గట్టు చట్టాలు చేసిందని చెప్పుకొచ్చారు. అమరావతి భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ఈ విచారణలో అసలు యజమానులెవరో, బినామీలెవరో తప్పక బయట పడుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాజధాని కోసం వేల ఎకరాలు, లక్షల కోట్లు అనవసరం అని సీఎం జగన్ మరోసారి పునరుద్ఘాటించడం విశేషం.
దీన్నిబట్టి జగన్ మూడు రాజధానుల విషయమై ఎంత గట్టి పట్టుదలతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగన్ పట్టు పట్టకనే ఉండాలి…పడితే మాత్రం, ఇదో ఇలాగే ఉంటుంది మరి!