వైఎస్‌ జగన్‌ వాళ్ళని కంట్రోల్‌ చెయ్యలేకపోతున్నారా.?

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారు. మూడు రాజధానుల ఎపిసోడ్‌ సహా అన్ని విషయాలపైనా వైఎస్‌ జగన్‌కి స్పష్టత వుంది.. ఈ విషయమై ఇప్పటికే అసెంబ్లీలో చూచాయిగా కొంత…

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారు. మూడు రాజధానుల ఎపిసోడ్‌ సహా అన్ని విషయాలపైనా వైఎస్‌ జగన్‌కి స్పష్టత వుంది.. ఈ విషయమై ఇప్పటికే అసెంబ్లీలో చూచాయిగా కొంత స్పష్టతనిచ్చారు కూడా. 'తొందరపాటు.. అత్యుత్సాహం' లేవు గనకనే, క్యాబినెట్‌ సమావేశంలో జీఎన్‌ రావు కమిటీ నివేదికపై చర్చించి, బోస్టన్‌ కన్సల్టెన్సీ నివేదిక కోసం ఎదురుచూడాలనే నిర్ణయానికి వచ్చారు.

ఆ కమిటీ నివేదిక తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన వచ్చి తీరుతుంది. అయితే, ఈలోగా వైసీపీ ముఖ్య నేతలు కొందరు మాటల విషయంలో 'అదుపు తప్పేస్తున్నారు'. దురదృష్టవశాత్తూ కొందరు మంత్రులు కూడా తమ స్థాయి మరచి వ్యవహరిస్తున్నారు.

ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే రాజకీయ ఉద్దేశ్యంతో కొందరు ఆ తరహా అత్యుత్సాహం ప్రదర్శించడం కొంతవరకు సబబే అయినా, ఈ క్రమంలో అమరావతి అభివృద్ధి పట్ల ఆందోళన చెందుతున్న సాధారణ ప్రజలు, రైతుల్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత పెరిగేందుకు మంత్రులు కారణమవుతుండం దురదృష్టకరమే.

కింది స్థాయి నేతలు చేసే వ్యాఖ్యల్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే. కానీ, మంత్రుల దగ్గర్నుంచి వస్తున్న ప్రకటనలే, ఆందోళన బాట పట్టిన అమరావతి రైతుల్లో (చిత్తశుద్ధితో రోడ్ల మీదకు వస్తున్నవారి గురించి మాత్రమే) తీవ్ర అసహనానికి కారణమవుతోంది. అదే సమయంలో, ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షం తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటూ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో బురద జల్లుతోంది.

'151 సీట్లతో అధికారంలోకి వచ్చాం. ఈ పరిస్థితుల్లో అందర్నీ కంట్రోల్‌ చేయడం ఒక్కోసారి కుదరకపోవచ్చు. కానీ, పార్టీ తీసుకున్న నిర్ణయానికీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికీ ఎవరూ వ్యతిరేకంగా వ్యవహరించడంలేదు కదా.. కొందరు మంత్రులు కొన్ని సందర్భాల్లో చేసే వ్యాఖ్యల్ని కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూడాలి..' అంటూ అధికార ప్రతినిథులు, ఇతర ముఖ్య నేతలు ప్రెస్‌మీట్లలోనూ, న్యూస్‌ ఛానళ్ళ చర్చా కార్యక్రమాల్లోనూ వ్యాఖ్యానించాల్సి వస్తోంది.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించి 7 నెలలు పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యహరించాల్సిందే. లేదంటే, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముంటుంది.

బొండాకి ఆళ్ల ఛాలెంజ్