ఇటీవల కాలంలో ఆడపిల్లలపై వరుస అఘాయిత్యాలు జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ దుర్ఘటనలు జగన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడానికి ప్రతిపక్షాలకు ఆయుధాలు అవుతున్నాయి. మరోవైపు దిశ చట్టంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా మాట్లాడుతూ…. మహిళలపై దాడులు జరుగుతున్నప్పుడు గన్ వచ్చే లోపే జగన్ అన్న వచ్చి శిక్షిస్తాడన్న భరోసా మహిళలకు కల్పించడమే తమ లక్ష్యమన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడా మాటలను ప్రత్యర్థులు పదేపదే ప్రస్తావిస్తూ… మహిళలపై దాడులు జరుగుతున్నా జగన్, గన్ ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన మార్క్ పంచ్‌లతో జగన్‌పై విరుచుకుపడ్డారు. ఆడపిల్లలపై అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆడపిల్లలపై గత మూడు రోజులుగా వరుసగా జరుగుతున్న దారుణాలను గుర్తు చేశారు.
గుంటూరులో మొన్న రమ్య నేలకొరిగితే..నిన్న గుంటూరు జిల్లా రాజుపాలెంలో చిన్నారి పశువాంఛలకు బలయ్యిందన్నారు. నేడు విజయనగరం జిల్లా చౌడవాడలో ఉన్మాది పెట్రోల్ పోసి యువతిని తగులబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు మూడు రోజుల్లో ఆడపిల్లలపై మూడు అమానవీయ ఘటనలు జరిగినా దున్నపోతు ప్రభుత్వంలో స్పందనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘జగన్ రెడ్డి గారూ..మీ ఇంట్లో మహిళలకు రక్షణలేదు..మీ ఇంటి పక్క నివసించేవారూ అత్యాచారానికి గురయ్యారు. మీ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రతలేని భయం భయం బతుకులైపోయాయి. ఇంకా లేని ఆ దిశ చట్టం..రక్షించలేని దిశయాప్ పేరుతో ప్రచారం చేసుకోకండి..పబ్లిసిటీయే సిగ్గుపడుతుంది’ అని ఘాటుగా దెప్పి పొడిచారు. ఆడపిల్లల ఉసురు తగిలితే తమకూ, ఈ రాష్ట్రానికీ మంచిది కాదని లోకేష్ హితవు పలికారు. దయచేసి ఆడపిల్లల భద్రతపై దృష్టి సారించాలని ఆయన కోరడం గమనార్హం.