ప్రచారానికి కూడా ఒక సమయం, సందర్భం ఉండాలి. కానీ జగన్ సర్కార్‌కు అలాంటి పట్టింపులేవీ ఉన్నట్టు కనిపించడం లేదు. మీడియాలో ప్రచార విషయానికి వస్తే జగన్ సర్కార్‌ది ఓ వింత పోకడ. ప్రాంతీయ మీడియాను జగన్ సర్కార్ అసలు పట్టించు కోదు. కానీ జాతీయ మీడియా అంటే మాత్రం రాష్ట్ర సర్కార్‌కు విపరీతమైన మోజు. దానికి పరాకాష్టగా నిన్న జారీ చేసిన ఓ ఉత్తర్వే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
జాతీయ స్థాయిలో మన రాష్ట్రం, నాయకుల ప్రతిష్టను (ఇమేజ్) పెంచేందుకు ఏపీ ప్రభుత్వం రూ.8.15 కోట్లు ఓ జాతీయ మీడియా సంస్థకు ముట్టచెబుతూ ఆర్డర్స్ ఇచ్చింది. బెన్నెట్ కోల్‌మన్ అండ్ కంపెనీకి చెందిన మీడియా గ్రూప్ “టైమ్స్ నెట్‌వర్క్” ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పథకాలపై జాతీయ స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఆ నిధులు ఖర్చు చేయనున్నట్టు బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అ
సలే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు, దీనికి తోడు కరోనా దెబ్బతో మరింత కుదేలు కావాల్సి వచ్చింది. సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగుల జీతాలకే ఏ నెలకు ఆ నెల అన్న రీతిలో నెట్టుకు రావాల్సిన దయనీయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ఇలాంటి విపత్కర సమయంలో ఓ జాతీయ మీడియా సంస్థకు కోట్లాది రూపాయలు అప్పనంగా ధారాదత్తం చేయడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాలో పాజిటివ్ కథనాలతో ఇమేజ్ వస్తుందనుకుంటే …చంద్రబాబు ఇమేజ్ ఎంతగా పెరిగి ఉండాలి? ఆయన చేసుకున్నంత ప్రచారం దేశంలో మరే ముఖ్యమంత్రి అయినా చేసుకుని ఉంటారా? జగన్ సర్కార్ నడత చూస్తోంటే బాబు విధానాలనే అనుసరిస్తున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి.
మరోవైపు తమకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా, ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా జగన్ పంచి పెడుతున్నారని కొన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఉదాహరణకు డీఏ విడుదలకు సంబంధించి ప్రభుత్వంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. డీఏల విడుదలపై ఇటీవల ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
2018 జూలై నుంచి 2019 డిసెంబర్ వరకు మూడు డీఏ లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ ఉన్నాయి. 2020 జనవరి నుంచి రావాల్సిన డీఏను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.
వీటిలో ఒక డీఏను 2021, జనవరి నుంచి, రెండో డీఏను 2021 , జూలై నుంచి, మూడో డీఏను 2022, జనవరి నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కరోనా కారణంగా వాయిదా వేసిన మార్చి ఏప్రిల్ నెల సగం జీతాలను ఐదు విడతల్లో చెల్లిస్తామని వెల్లడించింది. మొదటి విడత ఈ నవంబర్ నెల జీతంతో కలిపి ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే విడతల వారీగా డీఏలను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
“పెళ్లి రోజు చదివింపులు చదివిస్తే బాగుంటుంది. అలా కాకుండా ఒక బిడ్డ పుట్టాక చదివింపులు చదివించినట్టు మన ప్రభుత్వ ప్రకటన ఉంది. 2020 రైతు భరోసా 2022లో ఎలా ఉంటుందో ఆలోచించండి” అని అంటూ ఉద్యోగులు వ్యంగ్యంగా తమ సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక వైపు ఆర్థిక ఇబ్బందులని చెబుతూనే, మరోవైపు ఇలా కోట్లాది రూపాయలను అనవసరంగా ప్రచారానికి ఖర్చు పెడుతుంటే కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు.
పైగా ఆంధ్రజ్యోతో, మరో మీడియా సంస్థల యజమానులపై కోపంతో మొత్తంగా తెలుగు మీడియానే దూరం చేసుకోవడం ఏంటో అసలు అర్థం కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎప్పుడూ కూడా ఆయన తెలుగు మీడియాను దూరంగా పెట్టేవాళ్లు కాదు.
పైగా తనకు ఎల్లో మీడియా యజమానులతోనే తప్ప జర్నలిస్టులతో పేచీ లేదని ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. కానీ జగన్ విషయంలో అందుకు పూర్తి విరుద్ధమైన వ్యవహారం నడుస్తోంది. ఇప్పటికైనా ప్రాంతీయ మీడియా జర్నలిస్టులతో జగన్ సర్కార్ వైఖరి మారాల్సిన అవసరం ఉంది.
టైమ్స్ నెట్‌వర్క్‌కు రూ.8.15 కోట్లు ఇచ్చి , జాతీయ స్థాయిలో అనుకూలంగా ప్రచారం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? అసలు తెలుగు పత్రికలు, చానళ్లు చూసే పరిస్థితే లేనప్పుడు ఎవరిని సంతృప్తి పరచడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో ప్రభుత్వ పెద్దలు ఒకసారి ఆత్మపరిశోధన చేసుకోవాల్సి ఉంది.