విద్యా వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన చేయడం, పేదవారికి ఉన్నత విద్య అందుబాటులోకి తేవడం.. ఇదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల. ఫీజు రీఎంబర్స్ మెంట్ ద్వారా ఆ కల సగం సాకారమైంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ తో ఎంతోమంది పేద విద్యార్థులు, ఎంసీఏ, ఎంబీఏలు చదివారు, ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంజినీరింగ్ వాల్యూ పడిపోయిందని కొన్ని విమర్శలున్నా.. పేదలకు మాత్రం ఉన్నత విద్య పూర్తిగా అందుబాటులోకి వచ్చింది వైఎస్ హయాంలోనే.
ఇక జగన్ జమానాలో వైఎస్ కల పూర్తిగా సాకారం కాబోతోంది. పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించాలనేది ఇప్పటి తల్లిదండ్రుల కల. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టలేక, పల్లెటూళ్లలో సరైన వసతులు లేక సగం మంది సతమతమయ్యేవారు. ఇంకొంతమంది తమ పిల్లల చదువుల కోసం అప్పు చేసి తిప్పలు పడేవారు. ఆ కష్టాలన్నీ తీర్చేందుకే జగన్ అమ్మఒడి ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునేవారికి కూడా అమ్మఒడి అందించారు.
వాస్తవానికి ప్రతి బిడ్డకూ అమ్మఒడి సొమ్ము అందాల్సి ఉన్నా.. ప్రైవేట్ స్కూల్స్ కి కూడా పథకం వర్తింపజేయడంతో ఇద్దరు ముగ్గురు పిల్లలున్నా కూడా ఒక తల్లికి ఒకటే ఆర్థిక సాయం అందింది. అయితే వచ్చే ఏడాది ఈ పథకంలో భారీ మార్పులు ఉండబోతున్నాయని సమాచారం.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో కూడా ఇంగ్లిష్ మీడియం అందుబాటులో ఉంటుంది. నాడు-నేడు పథకం ద్వారా అన్ని మౌలిక వసతులు అప్పటికి పూర్తవుతాయి. స్కూల్ తెరవగానే యూనిఫామ్, షూస్, బుక్స్.. అన్నీ ఒకేసారి ఉచితంగా ఇచ్చేస్తారు. అంటే వచ్చే ఏడాదికల్లా ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయన్నమాట.
సో.. అమ్మఒడిని కేవలం ప్రభుత్వ స్కూళ్లకు పరిమితం చేసినా వచ్చే ఇబ్బందేమీ ఉండదు. పేదలంతా ప్రభుత్వ స్కూళ్లలోనే ఉంటారు కాబట్టి, అసలైన లబ్ధిదారులు వారే అవుతారు. అప్పుడు ప్రతి తల్లికి కాకుండా, ప్రతి బిడ్డకు అమ్మఒడిని అందించే ఆర్థిక వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ప్రైవేటుపై వేటుకి రంగం సిద్ధమవుతోందన్నమాట.
ఇన్నాళ్లూ పిల్లల భవిష్యత్ ని బూచిగా చూపి తల్లిదండ్రుల వద్ద ఫీజుల పేరుతో వేలకు వేలు గుంజేసిన కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొత్తం ఈ దెబ్బతో విలవిల్లాడాల్సిందే. ప్రభుత్వ స్కూళ్లు కళకళలాడాల్సిందే. ఆ విధంగా.. తండ్రి ఉన్నత విద్యను పేదలకు అందుబాటులోకి తెస్తే.. తనయుడు ప్రాథమిక విద్యలో పెను మార్పులకి శ్రీకారం చుట్టారు. దటీజ్ వైఎస్సార్.. దిసీజ్ జగన్ సార్..