ఇంకా ఈ మౌనం అవసరమా పవన్..!

గతంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి పార్టీ షోకాజ్ నోటీస్ పంపించిందనే ఓ ఫేక్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఆ వెంటనే పార్టీ నాయకులు కలుగజేసుకుని అలాంటిదేమీ…

గతంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి పార్టీ షోకాజ్ నోటీస్ పంపించిందనే ఓ ఫేక్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఆ వెంటనే పార్టీ నాయకులు కలుగజేసుకుని అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అప్పటికే రాపాక సీఎం జగన్ ని అసెంబ్లీ సాక్షిగా పొగిడేస్తూ ఉంటే, ఉండబట్టలేక జనసైనికులెవరో ఆ ఫేక్ నోటీస్ పంపించి తమ కడుపుమంట చల్లార్చుకున్నారు.

కానీ ఇప్పుడలాంటి ఫేక్ నోటీసులు కూడా లేవు. బహిరంగంగానే జనసేన ఎమ్మెల్యే తాను ఆ పార్టీకి చెందినవాడిని కానంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేగానే గుర్తించాలని తన అనుచరులకు చెప్పేశారు. పార్టీ అధినేతే స్వయంగా రెండుచోట్ల ఓడిపోయినప్పుడు ఇక ఆ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు కదా అనేశారు. ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే పార్టీని, పార్టీ అధినేతను అన్నేసి మాటలంటుంటే కనీసం పవన్ కల్యాణ్ కి కానీ, ఆ పార్టీ పెద్దలకు కానీ చీమ కుట్టినట్టయినా లేదు.

ఇటు జనసైనికులు మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాపాక పై బూతు జోకులు వేస్తూ తమ శాడిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన గతంలో అన్న మాటల్ని, ఇప్పుడు చేసిన వ్యాఖ్యలను పోలుస్తూ వీడియోలు విడుదల చేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధిష్టానం మాత్రం మౌనం వహిస్తోంది.

ఇప్పటివరకూ రాపాక, జగన్ ని సపోర్ట్ చేశారు కానీ, జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడలేదనే ఉద్దేశంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని అనుకుందాం. ఇప్పుడు ఆ హద్దు కూడా ఆయన దాటేశారు, ఇప్పుడు కూడా జనసేన స్పందించకపోతే ఎలా? పోనీ పవన్ నేరుగా స్పందించకపోయినా పార్టీ తరపున అయినా కనీసం ఓ నోటీస్ పంపించాలి కదా. అయినా మాకెందుకులే అనుకుంటే ఇక పార్టీ ఎందుకు, పార్టీ నియమాలు ఎందుకు? ఎవరో వైరిపక్షాలు అంటున్న మాటలు కాదు ఇవి. స్వయంగా జనసైనికులు, పవన్ కల్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్న ఆగ్రహ జ్వాలలు.

అవును.. పవన్ ఇకనైనా మౌనం వీడాలంటున్నారు జనసైనికులు. పార్టీని నడపాలంటే ముందు పార్టీపై అజమాయిషీ ఉండాలి. పెత్తనం చలాయించక్కర్లేదు, కనీసం ఎదురు తిరిగినవారిపై వేటు వేసే ధైర్యం అయినా ఉండాలి. పవన్ ఉదాసీనత వల్లే ఇప్పటి వరకూ పార్టీ ఇలా ఉందని, ఇకనైనా కఠినంగా ఉండాలంటున్నారు. వెంటనే రాపాకకి షోకాజ్ నోటీస్ పంపించాలని డిమాండ్ చేస్తున్నారు జనసైనికులు. పవన్ ఇప్పుడైనా మౌనాన్ని వీడతారో లేదో చూడాలి.

ఈ గడ్డంతో నిద్ర పట్టట్లేదు

ఒకసారి మోసపోయాను ఈ సారి వదలను