పవన్ నిర్ణయంతో జనసైనికుల్లో టెన్షన్

పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం చేద్దాం. అధికారాన్ని చేజిక్కించుకుందాం. ఇదీ పవన్ కల్యాణ్ పదే పదే చెప్పే మాటలు. అదే పవన్ కల్యాణ్.. జగన్ మంచి పాలన ఇస్తే ఇక నేనెందుకు వెళ్లి సినిమాలు చేసుకుంటానని…

పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం చేద్దాం. అధికారాన్ని చేజిక్కించుకుందాం. ఇదీ పవన్ కల్యాణ్ పదే పదే చెప్పే మాటలు. అదే పవన్ కల్యాణ్.. జగన్ మంచి పాలన ఇస్తే ఇక నేనెందుకు వెళ్లి సినిమాలు చేసుకుంటానని కూడా అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాలెప్పుడూ నిలకడగా లేవు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఇంకేం కావాలి. రాజకీయాల్లో దిగినప్పుడు తాడో పేడో తేల్చుకోవాలి. అటుఇటుగా ఉంటే అభిమానులు చీదరించుకుంటారు.. ఛీకొట్టి వెళ్లిపోతారు. ప్రస్తుతం జనసేనలో అదే జరుగుతోంది.

కాస్తో కూస్తో సరుకున్నోళ్లంతా సర్దుకుంటున్నారు, పవన్ భజన బృందం మాత్రమే చేతులు కట్టుకుని ఆయన ముందు నిలుచుంటోంది. ఇలాంటి దశలో పవన్ కల్యాణ్ ట్రాక్ మార్చి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆర్థిక కష్టాలంటూ ఓ సాకు వెదికారు కానీ.. ఆయన మనసులో ఏముందో ఇప్పుడిప్పుడే జనసైనికులకు బోధపడుతోంది. ఒక సినిమా చేసి వచ్చేస్తారనుకుంటే, వెంటనే రెండో సినిమా ఒప్పుకున్నారు, ఆ వెంటనే మూడో సినిమా వార్త కూడా బైటకొచ్చింది. ఇప్పుడేమో అదిగదిగో నాలుగో సినిమాకి కూడా కాల్షీట్లు ఇచ్చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలు నిజంగానే జనసైనికులను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. వకీల్ సాబ్ పోస్టర్ పడగానే ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవర్ ఫుల్ మూవీ అనగానే ఎగిరి గంతేశారు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ మాంచి స్టోరీ రెడీ చేశాడంటే పొంగిపోయారు. ఇప్పుడు నిర్మాత రామ్ తాళ్లూరికి పవన్ కాల్షీట్లిచ్చారనే వార్త రాగానే మరోసారి అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

ఈ సంబరమంతా అభిమానులదే కానీ, జనసైనికులది కాదు. పవన్ కల్యాణ్ సీరియస్ గా రాజకీయాలు చేయాలి, వచ్చే దఫా సీఎం అయిపోవాలని కలలు కంటున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు. అటు బీజేపీయేమో టీడీపీని భూస్థాపితం చేస్తాం, వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం అవుతాడని బీరాలు పలుకుతోంది. ఇటు పవన్ కల్యాణేమో సినిమాల మీద సినిమాలు కమిట్ అవుతున్నారు. 2024లో ఎన్నికలున్నాయి. ఇప్పటినుంచి కుస్తీలు పడితే కానీ అప్పటికి తెమలని పరిస్థితి. అందులోనూ వైసీపీ బలంగా ఉంది, రోజురోజుకీ బలం పుంజుకుంటోంది. టీడీపీ నక్కజిత్తుల్ని ఎప్పటికీ బీజేపీ-జనసేన అంచనా వేయలేవు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పవన్ పాటలు, ఫైట్ లు చేస్తూ కారవాన్ లో కూర్చుంటే పార్టీకి దిక్కెవరు. ఈ నాలుగు సినిమాల తర్వాత పవన్ కొత్త సినిమాలు ఒప్పుకోరనే గ్యారెంటీ ఏమైనా ఉందా. చేస్తున్న సినిమాలు హిట్టయితే అటువైపు ఆకర్షణ మరింత పెరుగుతుంది. ఫ్లాపయితే కసితో మరో సినిమా చేసే అవకాశముంది. ఎలా చూసుకున్నా పవన్ మళ్లీ పార్టీకి, రాజకీయాలకు దూరమవుతున్నట్టే. దూరమౌతున్నట్టు కాదు.. ఆల్రెడీ ఆయన దూరమయ్యారనే చెప్పుకోవాలి.

ఈనాడు పాలిష్డ్, జ్యోతి బరితెగింపు

ప్రయత్నం మంచిదే.. ప్రయాణమే