అడుగులు ముందుకు వేయని జనసేనాని

గతంలో మెగాస్టార్ చిరంజీవిని, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చూస్తున్న తెలుగు సినిమా హీరోలెవరూ భవిష్యత్తులో సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టకపోవచ్చు. వీళ్ళ ఇద్దరినీ చూసినప్పుడు అర్ధమైనదేమిటంటే సినిమాల్లో హీరోలుగా రాణించినవారు…

గతంలో మెగాస్టార్ చిరంజీవిని, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చూస్తున్న తెలుగు సినిమా హీరోలెవరూ భవిష్యత్తులో సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టకపోవచ్చు. వీళ్ళ ఇద్దరినీ చూసినప్పుడు అర్ధమైనదేమిటంటే సినిమాల్లో హీరోలుగా రాణించినవారు రాజకీయాల్లో రాణించలేరని. వీళ్ళు సక్సెస్ కాలేదు కాబట్టి ఇంకెవరూ కారా ? అని ప్రశ్నించవచ్చు. 

కారు అని కచ్చితంగా చెప్పలేము కూడా. రాజకీయాలను సీరియస్ గా తీసుకున్నప్పుడు అవుతారు. అదే సమయంలో ధైర్యంగా, సమయస్ఫూర్తితో రాజకీయాలు చేయగలగాలి. సినిమాల్లో హీరో అయినంత మాత్రాన జనం రాజకీయాల్లో హీరోగా చూడరనే సంగతి గుర్తు పెట్టుకోవాలి.

పూర్తి సమయం రాజకీయాలకే వెచ్చించాలి. నిరంతరం ప్రజల్లో ఉండాలి. అన్న చిరంజీవి చేసిన తప్పులు తాను చేయబోనంటూ పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ చిరంజీవికంటే ఘోరమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తోందంటే …ఒకప్పుడు వీరుడిలా, శూరుడిలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ప్రశ్నిస్తా, మార్పు తెస్తా అంటూ బీరాలు పలికిన పవర్ స్టార్ ఏపీలో జరుగుతున్న పరిణామాలను చేష్టలుడిగి చూస్తున్నాడు. 

ఏపీలో  మున్సిపల్  ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో టీడీపీకి ఆదరణ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే  ఫలితాలతో నిమిత్తం లేకుండా  70 ఏళ్ళ వయసులోనూ చంద్రబాబు నాయుడు అలుపు లేకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన కంటే ఎంతో చిన్నవాడైన పవన్ నిస్సహాయంగా మిగిలిపోతున్నాడు. బీజేపీ కుట్రకు బలైపోతున్నాడు.

అటు అధికార వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెండు పోటా పోటీ ప్రచాలతో దూకుడుగా దూసుకెళ్తున్నాయి.. పవన్ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడంలేదు.  మిగిలిన చోట్ల ఎలా ఉన్నా గ్రేటర్ విశాఖ ప్రచారానికి పవన్ రాలేకపోతుండడం పై జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పొత్తు మేలు చేయకపోగా పార్టీకి మరింత నష్టం చేసిందని మండిపడుతున్నారు.

ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.  విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ బంద్ జరిగింది.  అన్ని రాజకీయ పార్టీలు కార్మికుల పక్షాన నిలిచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం బంద్ కు మద్దతు తెలిపినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంద్ విషయంలో నోరెత్తలేదు. 

కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ వైఖరిని కూడా స్పష్టం చేయలేకపోతున్నాడు. స్టీల్ ప్లాంట్ పై పవన్ నోరు మెదపకపోతే విశాఖలో పార్టీకి  నష్టం తప్పదని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యంగా పవన్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేశాడు.  ఓటమి పాలైనా బాగానే  ఓట్లు పోలయ్యాయి. గాజువాక తో పాటు విశాఖ వ్యాప్తంగా ఉన్న యువతలో పవన్ పై మంచి క్రేజ్ ఉంది. దీంతో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో సత్తా చాటొచ్చని.. బీజేపీ పొత్తు కూడా తమకు కలిసి వస్తుందని మొదట భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్న జనసేన పార్టీకి, బీజేపీతో పొత్తు లాభించకపోగా, పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన గొంతు వినిపించేవాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ ఆచి తూచి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడితే ఏ జరుగుతుందో అన్నట్లుగా భయపడుతున్నాడు.  బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన విశాఖ ఉక్కు కార్మికులకు అండగా తన స్టాండ్ ను ప్రకటించ లేకపోతున్నాడు. 

స్టీల్ ప్లాంట్ పై  ఏమీ  మాట్లాడకుండా ప్రచారానికి వెళ్తే ఇబ్బందులు తప్పవు.. ప్రజల నుంచి నిరసన గళం వినిపిస్తుంది. కార్మిక సంఘాలు సైతం ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. అలా అని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని పవన్ చెప్పినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.

ఎందుకంటే కేంద్రం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఇలాంటి సమయంలో కేంద్రం పెద్దలను పవన్ విమర్శించలేడు.  వారిని విమర్శించకుండా గాజువాక లాంటి ప్రాంతాల్లో ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు.  అయితే ఈ నెల 8న పవన్ విశాఖకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మార్పు తెచ్చేందుకే బీజేపీతో కలిశామని పవన్ చెప్పాడు. ఆయనలో మార్పు వచ్చిందిగానీ ఏపీలో మార్పు వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. సినిమా రంగానికి పూర్తిగా స్వస్తి చెప్పానని, మళ్ళీ సినిమాల్లో నటించే ప్రసక్తి లేదని చెప్పిన పవన్ సినిమాల జోరు పెంచాడు. 

తాను పూర్తిగా సినిమా రంగంలో ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువాగా నటిస్తున్నాడనిపిస్తోంది.   ఇదిలా ఉంటే ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటిందని, మార్పు మొదలైందని చెప్పాడు పవన్. కానీ ఆయన చెబుతున్న మార్పుకు పంచాయతీ ఎన్నికలు అసలు ప్రాతిపదికే కాదు. 

అధికార పార్టీ దౌర్జన్యాలకు జనసైనికులు ఎదురు నిలిచారని ఆనందం వ్యక్తం చేశాడు.  ఒత్తిళ్లు ఉన్నా జనసైనికులు ఎన్నికల బరిలో నిలిచారని చెప్పాడు.  మార్పు కోసమే యువత ధైర్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తోందని అన్నాడు. పవన్ పార్టీ పెట్టినప్పటినుంచి మాటలు జోరుగా ఉన్నాయి చేతల్లో ఆ జోరు కనబడటం లేదు. 

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే