అంతా కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పుడు రఘువీరా రెడ్డి అంటే జేసీ సోదరులకు అంతా ఇంతా మంట కాదు! రఘువీరా రెడ్డిని ఉద్ధేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసేందుకు కూడా వెనుకాడే వారు కాదు. రఘువీరారెడ్డిని ఉద్దేశించి మీడియా ఎదురుగానే ఇష్టానుసారం మాట్లాడే వారు.
రఘువీర అప్పటికి మంత్రి హోదాలో ఉన్నా వీరి తీరు చాలా ఘాటుగా ఉండేది. ప్రత్యేకించి 2009లో వైఎస్ మంత్రివర్గ ఏర్పాటు అనంతరం రఘువీరకు మంత్రి పదవి దక్కి, తనకు మంత్రి పదవి దక్కని తరుణంలో తమ నోటికి బాగా పని చెప్పారు జేసీ దివాకర్ రెడ్డి.
అయితే రఘువీర తన చాకచక్యమైన పాలిటిక్స్ తో ముందుకు సాగాడు. అటు వైఎస్ కు సన్నిహితుడిగా మెలిగి, వైఎస్ మరణానంతరం జగన్ ను సీఎం చేయాలంటూ సంతకాలు చేయించి, ఆపై కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అయిపోవడం రఘువీరకే సాధ్యం అయ్యింది!
ఇక కిరణ్ మంత్రివర్గంలోనూ రఘువీర మంత్రిగా కొనసాగుతుండటం, జేసీ దివాకర్ రెడ్డికి అప్పుడు కూడా అవకాశం దొరకకపోవడంతో మరింత భగ్గుమనేవారు. రఘువీర అంటే అంతెత్తు లేచేవారు. ఆయనను ఉద్దేశించి మీడియా ఎదురుగానే వాడూ, వీడు అంటూ సంబోధించడానికి జేసీ దివాకర్ రెడ్డి అస్సలు వెనుకాడే టైపు కాదు అప్పట్లో.
తాజాగా ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లి రఘువీరతో సమావేశం కావడం గమనార్హం. తమ భేటీలో రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు ప్రభాకర్ రెడ్డి. అది కామెడీ కాదు కానీ, తను రాయలసీమకు నీళ్లను సాధిస్తానంటూ, ఇందుకోసం అన్ని పార్టీలనూ కలుపుకుపోతున్నట్టుగా ప్రభాకర్ రెడ్డి ప్రకటించుకోవడమ సిసలైన కామెడీ.
రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తన విధానం ఏమిటో ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదు. ఇరు రాష్ట్రాల నీటి వివాదం విషయంలో టీడీపీ కిక్కురుమనడం లేదు. రాయలసీమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు లేఖలు రాస్తారు.
హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా డ్యాములు నిర్మించడాన్ని చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు వ్యతిరేకిస్తారు! ఈ పార్టీ నేత అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి తను రాయలసీమకు నీళ్లను సాధిస్తానంటాడు. మరి ఇదే ప్రకటనే చంద్రబాబుతో మాట మాత్రమైనా చేయించగలిగితే నిజంగానే ప్రభాకర్ రెడ్డి నీళ్లను సాధించేసినట్టే! అయినా అప్పట్లో వాడూ, వీడు.. అంటూ తాము ఎద్దేవా చేసిన రఘువీర ఇంటికి ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి వెళ్లడం మారిన తీరుకు నిదర్శనమా, లేక ఏదైనా అవసరార్థమా?