వరసగా రెండో సారి అరెస్టు అయి, పోలిస్ కస్టడీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విచారణ కొనసాగుతోందని తెలుస్తోంది. ట్రావెల్స్ బస్సుల అమ్మకాల అక్రమాల్లో అరెస్టు అయ్యి, దాదాపు రెండు నెలల పాటు జైల్లో ఉండి, బెయిల్ వచ్చి విడుదలైన సందర్భంలో నానా రచ్చ చేసి ప్రభాకర్ రెడ్డి అరెస్టు అయి సంగతి తెలిసిందే. కోవిడ్-19 పరిస్థితుల్లో ఉన్న నిబంధనలను అతిక్రమించడమే కాకుండా, అభ్యంతరం చెప్పిన ఒక పోలీసును కూడా తూలనాడి ప్రభాకర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు.
ఆ పరిణామాల్లో నమోదైన కేసుల్లో ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అరెస్టు చేసి మళ్లీ ఆయనను కడప జైలుకు తరలించారు. కేసులు అనంతపురం జిల్లాలో నమోదు కావడంతో ప్రభాకర్ రెడ్డిని పోలీసులు విచారణకు అనంతపురం తీసుకొస్తూ, అనంతరం కడప జైల్లో వదులుతున్నారట. ట్రావెల్స్ అక్రమాల్లో విచారణకు కూడా కడప జైలు నుంచి ప్రభాకర్ రెడ్డిని అనంతపురం, కర్నూలు జిల్లాలకు తీసుకెళ్లారు. కేసులు నమోదు అయిన చోటకు తీసుకెళ్లి ఆయనను విచారించారు.
పోలీసులను దూషించిన వ్యవహారంలో కూడా ఆయన విచారణకూ, జైలుకు అంటూ జిల్లాలు తిరగాల్సి వస్తోంది. అయితే తొలి సారి అరెస్టు అయినప్పుడు అలాంటి జర్నీలు చేసినా ప్రభాకర్ రెడ్డి లెక్క చేయనట్టుగా ఉన్నారు. రెండు నెలల పాటు జైల్లో ఉండివచ్చినా ఆ ప్రభావం ఏం లేనట్టుగా వ్యవహరించారు. రెచ్చిపోయి మళ్లీ కేసుల్లో బుక్ అయ్యి, అరెస్టు అయ్యారు. ఈ కేసులో ప్రభాకర్ రెడ్డికి అంత తేలికగా బెయిల్ రాదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.