ఆ జైలు నుంచి విడుదలై కనీసం రెండు రోజులు అయినా గడవక ముందే మళ్లీ అదే జైలుకు చేరారు తెలుగుదేశం నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. ట్రావెల్ స్కామ్ లో దాదాపు రెండు నెలల తర్వాత బెయిల్ పొంది విడుదల అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ లు బయట చాలా హంగామా చేశారు. కడప నుంచి తాడిపత్రి వరకూ వీళ్ల హంగామా కొనసాగినట్టుగా ఉంది. తీరా తాడిపత్రి చేరాకా.. టౌన్లో ఏదో ఉత్సవంలా వీళ్ల కాన్వాయ్ ను తరలించారు. ఈ విషయంపై స్థానిక పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇలాంటి నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించవద్దని పోలీసులు వారిని కోరారు. అయితే నిబంధనలు పాటిస్తే తమ గొప్పదనం ఏముందున్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై రెచ్చిపోయినట్టుగా ఉన్నారు. నిబంధనలను అతిక్రమించడమే తమ నాయకత్వ లక్షణం అనేది జేసీ బ్రదర్స్ నమ్మకం లాగుంది. ట్రావెల్స్ బిజినెస్ లో కూడా అలాగే వ్యవహరించినట్టుగా కేసులు నమోదయ్యాయి కదా!
ఈ క్రమంలో తాము కరోనాను కూడా లెక్క చేసేది లేదన్నట్టుగా వ్యవహరించారు, పోలీసులను తూలనాడారు. దీంతో ఏ మాత్రం ఆలస్యం లేకుండా ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచి, మళ్లీ కడప జైలుకే తరలించారు. రెండ్రోజుల కిందట జేసీ విడుదల అయ్యింది కూడా అదే కడప జైలు నుంచినే! ఆయన మళ్లీ అక్కడకే చేరినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సారీ ఆయనకు బెయిల్ దొరకొచ్చు. మరి అప్పుడైనా అనుచరులు ఆయనను ప్రశాంతంగా ఉండనిస్తారో, లేక బయటకు రాగానే మళ్లీ కొత్త కేసులకు ఆయనను అనుచరులే రెడీ చేస్తారో!