రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి తూర్పుగోదావరి జిల్లా కడియం ఎంపీపీ ఎన్నికపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ మూడు గంటలకు ఎంపీపీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కడియం ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠకు తెరలేపింది. పైగా జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన హెచ్చరిక మరోసారి తెరపైకి వచ్చి… చర్చకు దారి తీస్తోంది.
కడియం మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో వైసీపీ 9, జనసేన 8, టీడీపీ 4 స్థానాలను గెల్చుకున్నాయి. దీంతో ఎంపీపీని దక్కించుకునేందుకు ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమి చెరో రెండున్నరేళ్లు ఎంపీపీని పంచుకోవాలని నిర్ణయించాయి. అయితే ప్రత్యర్థి పార్టీల్లోని సభ్యులను తమ వైపు లాక్కుని ఎంపీపీ సీటును దక్కించు కోవాలని వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు జనసేన, టీడీపీలు చెమటోడ్చాల్సి వస్తోంది. ఇందులో భాగంగా రహస్య క్యాంపులు నిర్వహించాల్సి వచ్చిందని జనసేన, టీడీపీ నేతలు అంటున్నారు.
ఇదిలా వుండగా ఎంపీపీ ఎన్నిక ప్రక్రియలో ఏమైనా జరగొచ్చని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సందర్భంలో ఎంపీపీ ప్రక్రియ సజావుగా సాగకపోతే తమ అధినేత పవన్‌కల్యాణే రంగంలోకి వస్తారని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల పవన్‌కల్యాణ్ చేసిన హెచ్చరికను వారు గుర్తు చేస్తున్నారు.
‘ఈనెల 24న జరగనున్న కడియం ఎంపీపీ ఎన్నిక ప్రక్రియలో మా వాళ్లను ఇబ్బందిపెట్టినా, ఓటింగ్‌కు రానివ్వకపోయినా స్వయంగా నేనే వచ్చి తేల్చుకుంటా. అలాంటి పరిస్థితులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే దానికి నేనూ సిద్ధమే’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్ స్వయంగా కడియం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా? లేదా? అనేది ఇవాళ తేలనుంది.