వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన కమల్‌హాసన్ ధోరణి చూస్తే పార్టీని ఎత్తేసేలా ఉన్నారు. ప్రజాసేవకంటూ ఆయన మక్కల్ నీది మయ్యం అనే రాజకీయ పార్టీని అగ్ర హీరో కమల్‌హాసన్ స్థాపించిన విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చెన్నైలోని ఒక ప్రయివేటు హోటల్‌లో పార్టీ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కమల్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఎన్నో ఆశయాలు, లక్ష్యాలతో రాజకీయ పార్టీని స్థాపించానని, వాటికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే పార్టీని ఎత్తేయడానికి కూడా వెనుకాడనని ఆయన హెచ్చరించారు. కమల్ హెచ్చరికకు ఒక్కసారిగా కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. మొత్తం 37 అంశాలపై మూడు గంటల పాటు కమల్ చర్చించారు.
త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందుకు సమాయత్తం అయ్యేందుకు కమల్‌హాసన్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ, ఏ రాజకీయ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలి తదితర అంశాలపై నేతల అభిప్రాయాల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. హిందూ వ్యతిరేక పార్టీ అనే దుష్ప్రచారాన్ని ఎలా తిప్పుకొట్టాలనే అంశంపై చర్చించారు. యువశక్తిని తమ వైపు తిప్పుకోవడంపై చర్చించారు.
నేతలు, కార్యకర్తలు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చిన కమల్…ఇదే సందర్భంలో హెచ్చరికలు కూడా చేయడం సంచలనం కలిగిస్తోంది. తాను చెన్నైలో ఉండే నిర్వాహకుల పనితీరుపై నిఘా పెట్టానన్నారు. తమ కింద పనిచేసే వారికి విలువ ఇవ్వాలని సూచించారు. ఆ విషయంలో మరో మాటకు తావు లేదన్నారు. తన భవిష్యత్‌ను ప్రజాసేవకే అంకితం చేసినట్టు ప్రకటించారు. అయితే తన మాటలను కొందరు అవహేళన చేయవచ్చని, కానీ వాటిని తాను పట్టించుకోనన్నారు.
తన రాజకీయ ప్రస్థానంలో నిర్వాహకుల వల్ల ఎదైనా ఆంటకం కలిగితే చర్యలు ఎవరూ ఊహించని విధంగా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. రాజకీయ పార్టీకి ఆశయాలు, లక్ష్యాలు ముఖ్యమని, వాటిని కాదని వక్రమార్గంలో పయనిస్తే పార్టీ ఎత్తేసి మరో మార్గంలో ప్రజాసేవ వైపు వెళ్లేందుకు కూడా వెనుకాడనని హెచ్చరించారు. దీంతో కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. కమల్ హెచ్చరికలు చూస్తుంటే ఆయన మనసులో మరేదో ఆలోచన ఉన్నట్టుందని వారు ఓ అభిప్రాయానికి వచ్చారు.