తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మేనమామ, ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి దుమ్ము రేపారు.
కమలాపురం నగర పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మేనమామ రవీంద్రనాథరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో సహజంగానే అందరి దృష్టి ఆకర్షించింది. ఏ మాత్రం తేడా వచ్చినా జగన్ ఊరుకోరనే భయంతో రవీంద్రనాథరెడ్డి సర్వశక్తులు ఒడ్డారు.
మొత్తం 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 15 వార్డులో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ కేవలం ఐదు వార్డుల్లో మాత్రమే సత్తా చాటింది. టీడీపీ గెలుపొందిన ఐదు వార్డుల్లో మెజార్టీలను గమనిస్తే తక్కువతో బయటపడ్డారని అర్థమవుతోంది.
కమలాపురం నగర పంచాయతీలో టీడీపీ అభ్యర్థులు 1,6, 12,13,19వ వార్డుల్లో విజయం సాధించారు. 6వ వార్డులో 20 ఓట్లు, 12వ వార్డులో 2 ఓట్లు, 13వ వార్డులో 7 ఓట్లు, 19వ వార్డులో కేవలం 3 ఓట్ల మెజార్టీతో మాత్రమే టీడీపీ అభ్యర్థులు విజయాన్ని సొంతం చేసుకున్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడిన మొదటి నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి ఎన్నికల్లో విజయం సాధించడంతో ఖుషీగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.