కాంగ్రెస్ పార్టీ ప్రభావంతమైన ప్రతిపక్షంగా లేదు.. అనే విషయాన్ని మరోసారి ప్రస్తావించారు ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కపిల్ సిబల్ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒకసారి అవలోకనం చేసుకోవాలని సూచించారు. పరిస్థితి రోజు రోజుకూ ఎందుకు దిగజారుతోందో సమీక్షించుకోవాలన్నారు.
ఎట్టకేలకూ ఆరేళ్లకు కపిల్ లాంటి వాళ్లు స్పందించాల్సిన రీతిలో స్పందించారు. అయితే యథారీతిన కాంగ్రెస్ లో సోనియా భక్తులకు ఇది నచ్చలేదు. సోనియా నొచ్చుకునే విషయాలను అస్సలు తట్టుకోలని అపరభక్తులు అభ్యంతరాలు చెప్పారు. సోనియ దయ చేత సీఎం హోదాలో కొనసాగుతున్న అశోక్ గెహ్లాట్ ఇప్పటికే స్పందించేశారు. కపిల్ తీరును తప్పుపట్టారు. ఇక సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇదే రీతిన స్పందించేశారు!
వాస్తవాల గురించి చర్చను ఇష్టపడని వారంతా కపిల్ తీరును తప్పు పట్టడం కాంగ్రెస్ లో విడ్డూరం ఏమీ కాదు. ఇదే అశోక్ గెహ్లటే తను కాకుండా సీఎం సీట్లో సచిన్ పైలట్ ఉండి ఉంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా స్పందించేవారో వేరే చెప్పనక్కర్లేదు. రాజకీయం అంటే జనాన్ని మెప్పించడం కాదు, సోనియాను మెప్పించడం అనే బాపతు జనాలు కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారు. గతంలో ప్రజల్లో ఉండే నేతలు కొందరైనా ఉండే వారు. వారంతా పార్టీకి దూరం కాగా.. అధిష్టాన భక్త పరాయణులు మాత్రమే అక్కడ మిగిలారు. ఈ పరిణామాల్లో ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ ఉంది.
ఈ నేపథ్యంలో సమీక్షించుకుందామని కపిల్ తన వాళ్లకు పిలుపునిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి తమ పార్టీకి జాతీయాధ్యక్షుడు లేకపోవడాన్ని కపిల్ మరోసారి ప్రస్తావించారు. ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాహుల్ తప్పుకున్నాకా ఇప్పటి వరకూ పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోవడానికి మరొక నేతను ఎన్నుకోలేకపోవడాన్ని ప్రస్తావించారు. ఇలా అయితే పార్టీ ఎలా బలోపేతం అవుతుందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు సోనియాకు రుచించవు, ప్రస్తుతం ఆమె వినిపించుకునే పరిస్థితుల్లో కూడా ఉండకపోవచ్చు. రేపో మాపో కపిల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. కాంగ్రెస్ వాళ్లు చేతులు దులిపేసుకున్నా గలరు!