ఎట్టకేలకూ కర్ణాటక కేబినెట్, గాలి అనుచరుడికి పదవి!

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ వాళ్లు ఎట్టకేలకూ కేబినెట్ ను ఏర్పరిచారు. ఇప్పటికే యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై రోజులు దాటిపోయినట్టున్నాయి. ఇన్నాళ్ల పాటు ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేకపోయారు ఆయన.…

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ వాళ్లు ఎట్టకేలకూ కేబినెట్ ను ఏర్పరిచారు. ఇప్పటికే యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై రోజులు దాటిపోయినట్టున్నాయి. ఇన్నాళ్ల పాటు ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేకపోయారు ఆయన. బీజేపీకి ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది బోటాబోటీ మెజారిటీనే. ఈ నేపథ్యంలో మంత్రివర్గం ఏర్పాటు పై చాలా ఆచితూచి స్పందించారు.

ఆఖరికి పూర్తిగా అమిత్ షా ఆదేశాల మేరకు కేబినెట్ ను ఏర్పరిచారు. 17 మంది చేత గవర్నర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. వారిలో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మిగిలిన వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలే.

సీనియర్లు అయిన జగదీశ్ శెట్టర్, ఈశ్వరప్ప, అశోక లకు యడియూరప్ప కేబినెట్లో బెర్తులు లభించాయి. ఇక గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుడు, ఎమ్మెల్యే శ్రీరాములకు కూడా కేబినెట్ బెర్త్  లభించింది. ఈయనకు  డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశాలున్నాయనే అంచనాలు ఉండేవి. అయితే మంత్రి పదవి లభించింది.

అయితే కేబినెట్ ఏర్పాటుతో సహజంగానే అక్కడ కొంతమంది అసంతృప్తికి గురయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు పడిపోవడంతో బోటాబోటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కమలనాథులు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ రెబెల్స్ కూడా అలాంటి ఆశవహుల్లో ఉన్నారు. అయితే వారిపై అనర్హత వేటుతో యడియూరప్పకు ఊరట లభించింది. ఇప్పుడైతే వారికి పదవులు ఇవ్వనక్కర్లేదు. 

కానీ కొన్ని నెలల్లో ఆ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. ప్రస్తుతానికి అయితే కొన్ని మంత్రి పదవులను ఖాళీగా ఉంచారు. వాటితో అసంతృప్తవాదులను ఊరించే అవకాశాలు లేకపోలేదు.