కేశినేని నానికి తీవ్ర ప‌రాభ‌వం

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి వ‌రుస ప‌రాభ‌వాలు త‌ప్ప‌డం లేదు. నిన్న టీడీపీ తిరుగుబాటు నేత‌లైన మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, నాగుల్ మీరా, ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మీడియా స‌మావేశం పెట్టి సొంత…

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి వ‌రుస ప‌రాభ‌వాలు త‌ప్ప‌డం లేదు. నిన్న టీడీపీ తిరుగుబాటు నేత‌లైన మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, నాగుల్ మీరా, ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మీడియా స‌మావేశం పెట్టి సొంత పార్టీ ఎంపీ కేశినేని నానిపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యాన్ని మ‌రిచిపోక‌నే మ‌రో అవ‌మానం చంద్ర‌బాబు రూపంలో ఎదురైంది. దీంతో కేశినేని అనుచ‌రులు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు.

విజ‌య‌వాడ టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత‌ను రెండు రోజుల క్రితం ఆ పార్టీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ప్ర‌క‌టించారు. దీంతో విజ‌య‌వాడ‌లో ఎలాగైనా మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోవాల‌ని కేశినేని నాని ప‌గ‌లురాత్రి అని చూడ‌కుండా శ్ర‌మిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో నేటి చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి త‌మ‌కు ఏ మాత్రం స‌మాచారం ఇవ్వ‌లేద‌ని టీడీపీ త్రిమూర్తులైన బొండా ఉమా, నాగుల్ మీరా, బుద్దా వెంక‌న్న మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ తిట్టిపోశారు.

కేశినేని నానిని చెప్పుతో కొట్టే వాడిన‌ని బుద్దా అంటే, గొట్టంలో అధిష్టానం అంటూ బొండా ఉమా తీవ్ర ప‌ద‌జాలాన్ని ప్ర‌యోగించారు. అలాగే కేశినేని నాని ఉంటే తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో పాల్గొనేది లేద‌ని తేల్చి చెప్పారు. తామో, కేశినేని నాని కావాలో తేల్చుకోవాల‌ని అధిష్టానానికి ఆయ‌న అల్టిమేట‌మ్ జారీ చేశారు.  

పార్టీని కుల పార్టీగా మార్చార‌ని నాగుల్ మీరా వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం కేశినేని నాని కుమార్తె , మేయ‌ర్ అభ్య‌ర్థి శ్వేత స్వ‌యంగా త‌న తండ్రిని తిట్టిన నేత‌ల వ‌ద్ద‌కు వెళ్లి చ‌ర్చించారు. అంతా స‌ద్దుమ‌ణిగింద‌ని టీడీపీతో పాటు ఎల్లో మీడియా  విభేదాల అగ్నిని క‌ప్పి పెట్టే ప్ర‌య‌త్నం చేశాయి.

ఈ నేప‌థ్యంలో ఈ వేళ చంద్ర‌బాబు ప్ర‌చార నిమిత్తం విజ‌య‌వాడ వెళ్లారు. బాబు వెంట ఎంపీ కేశినేని నాని లేక‌పోవ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. బాబుతో పాటు బుద్దా వెంక‌న్న‌, కేశినేని శ్వేత‌, మాజీ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్, అచ్చెన్నాయుడు, నిమ్మ‌ల రామానాయుడు ఉన్నారు. కీల‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్థానిక ఎంపీ అయిన కేశినేని లేక‌పోవ‌డంతో విభేదాలు స‌మ‌సిపోలేద‌ని బ‌హిర్గ‌త‌మైంది.  

చంద్ర‌బాబు ఆదేశాల‌తోనే కేశినేని నాని ప్ర‌చారంలో పాల్గొన‌లేద‌ని ఎంపీ అనుచ‌రులు చెబుతున్నారు. కూతురి కోసం త‌మ నేత అవ‌మానాల‌ను భ‌రిస్తున్నార‌ని, శ్వేత‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి ఉండ‌క‌పోతే క‌థ వేరేలా ఉండేద‌ని అంటున్నారు. నిన్న‌టి హెచ్చ‌రిక‌కు త‌లొగ్గి కేశినేని నానిని ప‌క్క‌న పెట్టార‌ని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ తిరుగుబాటు నేత‌లు చెప్పిన‌ట్టు కేశినేనిని ప్ర‌చారానికి రానివ్వ‌లేద‌ని, అలాంట‌ప్పుడు విభేదాలు ఎక్క‌డ స‌మ‌సిపోయాయ‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

అంద‌ర్నీ క‌లుపుకుని ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించి ఉంటే శ్రేణుల్లోకి పాజిటివ్ సంకేతాలు వెళ్లేవ‌ని, అందుకు విరుద్ధంగా కేశినేనిని ప‌క్క‌న పెట్ట‌డం వ‌ల్ల రాంగ్ సిగ్న‌ల్స్ పంపిన‌ట్టైంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విజ‌య‌వాడ టీడీపీ నేత‌ల మ‌ధ్య నెల‌కున్న విభేదాల‌ను బాబు స‌ద్దుమ‌ణ‌చ‌లేక‌పోయాడ‌నేందుకు కేశినేని గైర్హాజ‌రే నిద‌ర్శ‌న‌మంటున్నారు. 

ఇది ముమ్మాటికీ త‌మ‌నేత‌ను తీవ్రంగా అవ‌మానించ‌డ‌మే అని కేశినేని అనుచ‌రులు ధ్వ‌జ‌మెత్తుతున్నారు.  ఎన్నిక‌ల అనంత‌రం త‌మ నేత విశ్వ‌రూపం చూపుతార‌ని కేశినేని అనుచ‌రులు హెచ్చ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

రాజ‌మౌళి నేను అలా చుట్టాల‌య్యాం

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు