హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతాడనుకున్న కౌశిక్ రెడ్డి అనూహ్యంగా టీఆర్ఎస్ లోకి జంప్ చేసేశారు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ, ఈ చేరిక సమయంలో కౌశిక్ ను ఉద్దేశించి కేసీఆర్ స్పందించిన తీరు.. ఇంతకీ ఆయనకు ఉప ఎన్నిక టికెట్ దక్కుతుందా? అనే ప్రశ్నకు కారణం అవుతోంది.
ఇంతకీ కేసీఆర్ ఏమన్నారంటే.. కష్టపడి సాధించుకున్న తెలంగాణను బాగు చేసే బాధ్యత కౌశిక్ రెడ్డి లాంటి యువకుల మీద ఉంది. ఆయన కు హుజురాబాద్, కరీంనగర్ లకు పరిమితం చేయకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా పని చేసే అవకాశాలు వస్తాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కౌశిక్ రెడ్డిని ఇలా రాష్ట్ర నేతగా చేసేస్తానంటూ కేసీఆర్ ప్రకటించడం గమనార్హం.
అందరికీ పదవులు వస్తాయని.. ఒకరి తర్వాత మరొకరికి అవకాశాలు వస్తాయని కేసీఆర్ ఊరడింపు మాటలు చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలంతా కౌశిక్ రెడ్డి వెంట గట్టిగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మరి ఈ మాటల సారాంశం అంతా.. హుజరాబాద్ బై పోల్ లో కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ దక్కదు అనేదే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకవేళ హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డికే అవకాశం దక్కేట్టు అయితే కేసీఆర్ ఇలా మాట్లాడే వారు కాదేమో! నియోజకవర్గానికే పరిమితం చేయాలనుకోవడం లేదు.. అనేమాటను కేసీఆర్ ప్రయోగించడంతో, ఎమ్మెల్యే టికెట్ దక్కదనే సందేశాన్ని ఇచ్చినట్టే అనుకోవచ్చు. ముందు ముందు పదవులు వస్తాయని చెప్పడం ద్వారా కేసీఆర్ కుండబద్ధలు కొట్టిసేనట్టుగానే ఉంది వ్యవహారం!