కేసీఆర్ ‘వెర్షన్ 2.O’.. ఇది చాలా లైట్ గురూ!

గిట్టనివాళ్లని కేసీఆర్ మనస్ఫూర్తిగా తిడుతుంటే వినాలి.. అబ్బబ్బబ్బబ్బ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆయన తిట్లు, ఆ శాపనార్థాలు ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ వినోదాన్ని అందించేవి. సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తి బెంబేలెత్తిపోయేవాడు. కేసీఆర్…

గిట్టనివాళ్లని కేసీఆర్ మనస్ఫూర్తిగా తిడుతుంటే వినాలి.. అబ్బబ్బబ్బబ్బ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆయన తిట్లు, ఆ శాపనార్థాలు ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ వినోదాన్ని అందించేవి. సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తి బెంబేలెత్తిపోయేవాడు. కేసీఆర్ తో మనకెందుకులే అనే స్థాయికి వచ్చేసేవాడు. 

ప్రధాని మోడీ నుంచి ఎమ్మెల్యే స్థాయి నేత వరకు చాలామంది కేసీఆర్ మార్క్ చాకిరేవును చవిచూసిన వాళ్లే. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టడం లేదంటే దానికి “కేసీఆర్ నోరు” కూడా ఒక కారణం.

అలాంటి కేసీఆర్ ఇటీవల కాలంలో ఎవరికీ చాకిరేవు పెట్టలేదు. ఆయన బహిరంగ వేదికలకు దూరమైపోయారు కాబట్టి, అలాంటి అవకాశమే రాలేదని అనుకున్నా కానీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆయనకి ఓ బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లేలా బహిరంగ సభ ఏర్పాటు చేసినా.. కేసీఆర్ ప్రసంగం మాత్రం పూర్తిగా నేలమీదే నడిచింది.

ప్రధాని నరేంద్రమోదీ కూడా హైదరాబాద్ కి వచ్చిన వేళ, ఢిల్లీ గద్దెపై కూటమి జెండా ఎగరేస్తా, ఆ కూటమికి నేనే నాయకత్వం వహిస్తా అంటూ ఇటీవలే కేసీఆర్ తన మనసులో మాట బైటపెట్టిన నేపథ్యంలో.. బహిరంగ సభలో కూడా అలాంటి సవాళ్లే వినిపిస్తాయని ఆశించారు చాలామంది. కానీ అందరి అంచనాల్ని తారుమారుచేస్తూ, బక్కజీవిని నేను అంటూ బేలగా మారిపోయారు కేసీఆర్. బక్క కేసీఆర్ ని కొట్టడానికి ఇంతమందా? అంటూ ప్రశ్నించారు.

“టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, కేసీఆర్ ఉద్యమ నాయకుడు.. నా ప్రసంగాలంటే ప్రజలు చెవి కోసుకునేవారు, లక్షలమంది హాజరయ్యేవారు. ఉద్యమం గమ్యాన్ని ముద్దాడిన వేళ నుంచీ టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పరిణితి చెందిన పార్టీ.. ” అంటూ తన ప్రసంగాల పరిణితి గురించి ముందే హింట్ ఇచ్చేశారు కేసీఆర్.

అంతే కాదు తనపై సింపతీ క్రియేట్ చేసుకునేందుకు విపరీతంగా ట్రై చేశారు. “చివరకు నన్ను కూడా ఏకవచనంతో సంబోధిస్తున్నారు. చిల్లర మాటలకు ఆవేశపడను, నేను కూడా బ్రహ్మాండంగా తిట్టగలను, కానీ సంయమనం పాటిస్తున్నా..” అంటూ ముక్తాయించారు కేసీఆర్.

సింపతీతో సునాయాస విజయాన్ని అందుకోవాల్సిన దుబ్బాకలో పరిస్థితి తారుమారయ్యే సరికి కేసీఆర్ లో పరిణితి బాగానే కనిపిస్తోంది. అందుకే 'వాడెవడు వాడు' అనే.. పడికట్టు పదాలను పూర్తిగా పక్కనపెట్టేశారు. 'ఆయన', 'వారు', 'నేనెంత బక్క ప్రాణిని' అంటూ కొత్త వెర్షన్ స్టార్ట్ చేశారు.

మొత్తమ్మీద జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తన ప్రసంగాలతో ప్రజల్ని ఉర్రూతలూగించి, ప్రాంతీయ తత్వాన్ని వందకు వందశాతం రెచ్చగొట్టి, ప్రతి ఎన్నికల్లో భావోద్వేగాలను ఓట్లుగా మలుచుకునే కేసీఆర్.. ఈ సారెందుకో మెత్తబడ్డారు. ఈ “లైట్ వెర్షన్” గ్రేటర్ ఎన్నికల్లో ఏమాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి.

పవన్ కు కానరాని మద్దతు