అవసరం లేకపోయినా ముందస్తు ఎన్నికలకు వెళ్లి 2018లో సంచలనం సృష్టించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తూ ప్రతిపక్షాలను ఆలోచనలో పడేశారు.
ఐదేళ్ల ప్రభుత్వానికి నాలుగేళ్లకే సెలవు చీటీ రాసేయాలనుకుంటున్నారాయన. ఐదేళ్ల టైమ్ ఇస్తే ఆలోగా ప్రతిపక్షాలు మరింత బలపడతాయనే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీని నిలువరించాలంటే ముందస్తుకు వెళ్లడమే మేలని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభ తగ్గిపోతోంది. ఈ దశలో ఇటీవలే రైతు చట్టాలను వెనక్కు తీసుకుని వ్యూహాత్మక అడుగు వేశారు మోదీ. వచ్చే ఎన్నికలనాటికి మరిన్ని కొత్త అంశాలు తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ దశలో ఇప్పటికిప్పుడు బీజేపీకి చెక్ పెట్టాలంటే.. కేంద్రంలో ఉన్న వ్యతిరేకతని ముందుగానే క్యాష్ చేసుకోవాలి. ఇటు తెలంగాణలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ కి ముందస్తుగా షాకివ్వాలి. పాదయాత్రలు చేసుకుంటూ వెళ్తున్న షర్మిలని లెక్కలోకి తీసుకోకపోయినా ఏ ఒక్కరికీ ఎక్కువ టైమ్ ఇవ్వదలుచుకోలేదు కేసీఆర్. అందుకే ముందస్తు ఆలోచనలు, ముందస్తు ప్రయత్నాలు.
పథకాల జోరు..
సంక్షేమ పథకాలన్నిటినీ గాడిలో పెట్టి, ఆ తర్వాత మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించి ముందస్తుకి వెళ్తారట కేసీఆర్. గతంలో కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారని, అందుకే 2018లో ముందస్తుకి వెళ్లారని కొంతమంది అన్నారు కానీ, అది వర్కవుట్ కాలేదు.
మరి ఇప్పుడు ముందస్తు వ్యవహారానికి దేనితో లింకు ఉందో చూడాలి. దళితబంధు లాంటి పథకాలను మరిన్ని తెరపైకి తెచ్చి ఆ తర్వాత ఎన్నికల బరిలో దిగాలని చూస్తున్నారు.
ఈనెల 19నుంచి జిల్లాల పర్యటనలు..
జిల్లా పర్యటనలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈనెల 19నుంచి జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. వనపర్తి జిల్లాతో ఆయన ఈ టూర్లు మొదలు పెడతారు. ఆ తర్వాత జనగామ, నాగర్ కర్నూలు, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్, జిల్లాల్లో పర్యటిస్తారు.
కొత్త జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ ల ప్రారంభోత్సవం, ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభం.. ఇలా చాలా కార్యక్రమాలే పెట్టుకున్నారు. మొత్తమ్మీద కేసీఆర్ ముందస్తు అంచనాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారని తెలుస్తోంది.