తను ఒక జాతీయ పార్టీని స్థాపించబోతున్నట్టుగా వస్తున్న వార్తల పట్ల తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు.
గత కొన్నాళ్లుగా ఇందుకు సంబంధించి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. దేశాన్ని అధ్యక్ష తరహా పాలనలోకి మార్చాలని ప్రధాని మోడీ భావిస్తున్నారనే ఊహాగానాల మధ్యన అర్జెంటుగా కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ ఊహాగానాల్లో బోలెడన్ని అర్థం కాని విషయాలున్నాయి. ఆ అంశంపై కూలంకషమైన చర్చ కూడా అవసరం లేకుండా.. ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం లేదు అని కేసీఆర్ తేల్చి చెప్పారు.
ఇది వరకూ కూడా కేసీఆర్ జాతీయ స్థాయిలో కూటమి అంటూ ప్రకటించారు. అది కూడా మాటల వరకే పరిమితం అయ్యింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ సన్నిహితంగానే ఉన్నా.. కృష్ణ వరద నీటిని రాయలసీమకు వాడుకోవడానికి జగన్ ప్రయత్నాల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపణలు తెలుపుతూ ఉంది!
అదనంగా ఒక్క చుక్క నీరు వద్దని.. వరద పోయే కాలంలో మాత్రమే వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా, కేసీఆర్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఒక జాతీయ నేతగా ఎదగాలనుకునే వారి తీరు ఇలా ఉండకూడదని వేరే చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో కేసీఆర్ కూడా ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని తేల్చి ఊహాగానాలకు తెర వేశారు.