న‌యా కేసీఆర్‌…మోడీతో ఢీకి రెడీ

తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) అధినేత‌, ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌రావు న‌యా అవ‌తారం ఎత్త‌నున్నార‌నే సంకేతాలు వెలువడుతున్నాయి. జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ను త‌రిమికొట్టాల‌నే నినాదంతో ఆయ‌న త‌న‌ను తాను నూత‌నంగా ఆవిష్క‌రించుకోనున్నారు. పైపెచ్చు…

తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) అధినేత‌, ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌రావు న‌యా అవ‌తారం ఎత్త‌నున్నార‌నే సంకేతాలు వెలువడుతున్నాయి. జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌ను త‌రిమికొట్టాల‌నే నినాదంతో ఆయ‌న త‌న‌ను తాను నూత‌నంగా ఆవిష్క‌రించుకోనున్నారు. పైపెచ్చు కేంద్రంలో మోడీ స‌ర్కార్ అప్ర‌జాస్వామిక విధానాలు, రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రిస్తూ పాల‌న సాగిస్తున్న తీరుపై కేసీఆర్ గ‌త కొంత కాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు స‌మ దూరంలో ఉన్న పార్టీల‌ను క‌లుపుకుని జాతీయ‌స్థాయిలో న‌యాభార‌త్ పేరిట జాతీయ పార్టీని స్థాపించే దిశ‌గా కేసీఆర్ అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాల‌నే ఆలోచ‌న‌, ఆశ‌యం కేసీఆర్‌లో చాలా బ‌లంగా ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నిక‌లు, అలాగే 2019లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా వివిధ ప్ర‌చార స‌భ‌ల్లో కేసీఆర్ మాట‌లు గుర్తు చేసుకుంటే ఆ విష‌యం అర్థ‌మ‌వుతుంది.

‘దేశం గురించి మాట్లాడ్డానికి కేసీఆర్ ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌డు. పోరాడి సాధించుకున్న‌ తెలంగాణను మంచిగా చేశా. ఇక దేశం సమస్యలు తేలుస్తా. అవసరమైతే నేనే లీడ్‌ తీసుకుంటా’ అని గ‌తంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు తేల్చి చెప్పారు. జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌వేశించేందుకు ఇదే స‌రైన స‌మ‌యంగా కేసీఆర్ భావిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ మేర‌కు జాతీయ పార్టీ రిజిస్ట్రేష‌న్‌కు ఢిల్లీలో క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని స‌మాచారం.  

ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీని ధిక్క‌రించే, ప్ర‌శ్నించే ఏకైక ముఖ్య‌మంత్రుల్లో మ‌మ‌తాబెన‌ర్జీతో పాటు కాంగ్రెసేత‌ర  నేత‌ల్లో కేసీఆర్ గుర్తింపు పొందారు. జీఎస్టీ ప‌రిహారం ఇచ్చేది లేద‌ని, కావాలంటే రాష్ట్రాలు అప్పులు తెచ్చుకునేందుకు స‌డ‌లింపులు ఇస్తామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించ‌డంపై తెలంగాణ స‌ర్కార్ తీవ్ర అభ్యంత‌రం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు త‌మ ఆగ్ర‌హాన్ని, నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారు.

మోడీ స‌ర్కార్ విధానాల‌పై చాలా రాష్ట్రాల‌కు అభ్యంతరాలున్నా…భ‌యంతో నోరు మెద‌ప‌లేని ప‌రిస్థితి. ఉదాహ‌ర‌ణ‌కు మ‌రో తెలుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్‌ను చెప్పుకోవ‌చ్చు. జీఎస్టీ ప‌రిహారంపై కేంద్రం నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించే ప‌రిస్థితిలో ఏపీ అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు లేక‌పోవ‌డం ఆ రాష్ట్ర దౌర్భాగ్యాన్ని తెలియ‌జేస్తోంది. ఏపీకి కేంద్రం ఎంత అన్యాయం చేసినా ప్ర‌శ్నించ‌లేని నిస్స‌హాయ స్థితిలో ఆ రాష్ట్ర పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీలున్నాయి.

మ‌రోవైపు బీజేపీ అధ్య‌క్ష పాల‌న తీసుకొస్తుంద‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇందులో భాగంగా 2022 లేదా 2023లో జ‌మిలి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేంద్ర స‌ర్కార్ భావిస్తున్న‌ట్టు గ‌త కొంత కాలంగా విస్తృత ప్ర‌చారాన్ని ఓ వ‌ర్గం మీడియా, పార్టీలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప్ర‌చారాన్ని కేంద్ర స‌ర్కార్ ఖండించ‌డం లేదా నిజ‌మ‌ని కానీ చెప్ప‌డం లేదు. మౌనాన్ని అంగీకారంగా అర్థం చేసుకోవాల్సి వుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అధ్యక్ష తరహా పాలన అమల్లోకి వస్తే లోక్‌సభ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంద‌ని, ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని, దీన్ని అడ్డుకునేందుకే కేసీఆర్ జాతీయ‌పార్టీ స్థాపిస్తున్నార‌నే వాద‌న కూడా లేక‌పోలేదు.

ఏది ఏమైనా ప్ర‌శ్నించేందుకు, అన్యాయాల్ని అడ్డుకునేందుకు కేసీఆర్ లాంటి బ‌ల‌మైన నేత జాతీయ రాజ‌కీయాల్లో ఉంటే అంత‌కంటే కావాల్సిందేముంది! తెలుగువారిగా మ‌నమంతా గ‌ర్వ‌ప‌డాల్సిన విష‌య‌మే. అయితే కేసీఆర్‌తో క‌లిసి వచ్చే వాళ్లెవ‌ర‌నేదే పెద్ద ప్ర‌శ్న‌?

కొంచెం కొత్తగా.. కొత్త పలుకు