కరోనా థర్డ్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోసారి కఠిన నిబంధనలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. కరోనా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లపై ఇతర రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కాదు, కూడదంటే కొన్ని నివేదికలు తప్పని సరిగా సమర్పించాలనే నిబంధనలు విధిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేరళలో మరోసారి కరోనా కేసులు ఎక్కువగా రావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో చుట్టుపక్కల రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. కేరళలో శనివారం ఒక్కరోజే 20,624 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఐదు రోజుల్లో కేరళలో మొత్తం లక్ష మందికి పైగా ప్రజలు కరోనా బారినపడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం కేరళలో కరోనా విజృంభణను జాగ్రత్తగా గమనిస్తూ… ఎప్పటికప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ పరంపరలో ఈ నెల 5 నుంచి తమ రాష్ట్రానికి కేరళ నుంచి వచ్చే ప్రజలకు ఆర్‌టీపీసీఆర్ నివేదిక తప్పని సరి చేస్తూ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం ఆదివారం ఒక ప్రకటన చేశారు.
అలాగే కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం మంది కోవిడ్‌బారిన పడే అవకాశం ఉందని , కొత్త రకం డెల్టా వైరస్ కూడా తీవ్రమైందని ఆయన అన్నారు. రాష్ట్రంలో టీకా ప్రక్రియ పూర్తి కాకుండానే మూడో వేవ్ వస్తే … అప్పుడు పరిస్థితులు ఆందోళనకరంగా ఉండవచ్చని జార్జ్ ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష లేదా టీకా రెండు డోసులు వేయించుకున్న సర్టిఫికెట్ తప్పనిసరని కర్ణాటక ముఖ్య మంత్రి బసవరాజ బొమ్మై ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తం అవుతున్నట్టు సమాచారం.