విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా ట్వీట్ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ అధినేత నారా చంద్రబాబునాయుడిని నాని టార్గెట్ చేశారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడం నానికి ఇదేం కొత్తకాదు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చవిచూసిన తర్వాత కొంతకాలం నాని ట్వీట్లు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
అప్పట్లో కృష్ణా జిల్లాలో టీడీపీ ఘోర పరాజయానికి సొంత పార్టీ నేతలే కారణమంటూ…ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుడ్డా వెంకన్నను పరోక్షంగా తీవ్రస్థాయిలో ఎండగట్టారు. అప్పట్లో కేశినేని నాని బీజేపీలో చేరుతారని కూడా విస్తృత ప్రచారం జరిగింది.
ప్రస్తుతానికి వస్తే మరోసారి కేశినేని నాని ట్వీట్ వైరల్ అవుతుంది. దీనికి కారణం ఈ దఫా ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేయడమే. ఇంతకూ ఆ ట్వీట్ కథా కమామీషూ ఏంటో చూద్దాం.
“మన కలలు మనమే సాకారం చేసుకోవాలి. మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం కన్న కల అమరావతి. అది సాకారం అవ్వాలంటే 2024 లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా పార్టీలో అందరూ కష్టపడి పని చేయాలి. మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనల వల్ల ప్రయోజనం లేదు” అని నాని ట్వీట్ చేశారు.
ఇటీవల చంద్రబాబు వీడియోలో మీడియాతో మాట్లాడ్డం, నేతలతో చర్చించడం, ప్రభుత్వ విధానాలపై ట్విటర్ వేదికగా ప్రకట నలతో రాజకీయాలను సరి పెడుతున్నారు. ఇక ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా యధా తండ్రి…తధా పుత్రరత్నం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, చురుగ్గా పనిచేద్దామనే ఉత్సాహం లోకేశ్‌లో కనిపించలేదు.
బహుశా ఆ ఆవేదనే కేశినేని నాని తాజా ట్వీట్‌లో ప్రతిబింబించింది. మీడియా సమావేశాలు, పేపర్ స్టేట్‌మెంట్ల వల్ల ప్రయోజనం లేదనే నాని ట్వీట్ … బాబును దృష్టిలో పెట్టుకునే అని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. సొంత పార్టీ శ్రేణులకు, కొంత మంది నేతలకు తమ నేత ట్వీట్ నొప్పి కలిగించవచ్చని, అయితే అందులోని వాస్తవాన్ని గ్రహించి తప్పులను సరిదిద్దుకుంటే తిరిగి మంచి రోజులు వస్తాయని కేశినేని నాని అనుచరులు చెబుతున్నారు. ఇదే అదనుగా నాని అంటే గిట్టని టీడీపీ నేతలు ఎంపీపై బాబుకు ఫిర్యాదు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని సమాచారం.