కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ పర్యటనలో వైసీపీని తీవ్రంగా విమర్శించారు. కుటుంబ పాలన అంటూ మండిపడ్డారు. కేంద్రం డబ్బులిస్తుంటే, రాష్ట్రం పథకాల పేరుతో ప్రజల్ని ఏమారుస్తోందన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు.
కట్ చేస్తే అదే కిషన్ రెడ్డి, సీఎం జగన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ వీడియో చూస్తే ఎవరికైనా అనుమానాలు రాక మానవు. కిషన్ రెడ్డిలో ఇంత వినయ విధేయతలున్నాయా అనిపిస్తుంది. వయసు రీత్యా జగన్ కంటే 10ఏళ్లు పెద్దవారైన కిషన్ రెడ్డి, జగన్ సీఎం పోస్ట్ కి ఎక్కడలేని గౌరవం ఇచ్చారని అర్థమవుతోంది.
జగన్ కంటే ముందే తాను చేతులు జోడించి కారు దగ్గరనుంచి వినయాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. సీఎం జగన్ ఇచ్చిన మొమెంటో, పూలబొకే ఆనందంగా అందుకున్నారు. కుటుంబంతో సహా జగన్ ని కలిసి ముచ్చట్లు పెట్టారు. జగన్ కూడా అన్నా అంటూ ఆప్యాయంగా కిషన్ రెడ్డిని పలకరించారు. కిషన్ రెడ్డి అయినా, ఇంకెవరైనా.. వ్యక్తిగతంగా జగన్ కి అభిమానులు.
కాంగ్రెస్ కోటల్ని బద్దలు కొట్టి, కాంగ్రెస్ ని ఎదిరించి నిలబడ్డ జగన్ ని సహజంగా ఓ పోరాట యోధుడిగా చూస్తారు కిషన్ రెడ్డి. అందుకే ఆయన అభిమానంగా జగన్ ని కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీని పక్కనపెడితే కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో తన స్ప్లిట్ పర్సనాల్టీని పూర్తిగా బయటపెట్టారు. బీజేపీ కోసం వైసీపీని టార్గెట్ చేశారు. ఒక వెర్షన్ పార్టీ కోసం అయితే, ఇంకో వెర్షన్ ఆత్మసంతృప్తి కోసం పోషించారు కిషన్ రెడ్డి.
జన ఆశీర్వాద యాత్ర పేరుతో కిషన్ రెడ్డి జనంలోకి వెళ్లాలి, రెండు చోట్లా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాలి, బీజేపీ బలోపేతానికి కృషి చేయాలనేది బీజేపీ అధిష్టానం ప్లాన్. లేకపోతే తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, ఏపీలో యాత్ర పెట్టుకోవడం ఏంటి విచిత్రంగా..? ఎంత కేంద్ర మంత్రి అయినా, గతంలో కూడా ఎప్పుడూ ఆయన ఏపీలో పెద్దగా పర్యటించలేదు, ఈ దఫా శాఖ మారడంతో ఏపీలో అడుగుపెట్టారు, జన ఆశీర్వాదం కావాలన్నారు. ఏపీలో వైసీపీని ఎంతగా విమర్శించారో, తెలంగాణలో టీఆర్ఎస్ ని కూడా అదే స్థాయిలో విమర్శించారు కిషన్ రెడ్డి. జన ఆశీర్వాద యాత్రలో ఒకే రోజు తన టాస్క్ పూర్తి చేశారు.
కానీ ఇక్కడ జగన్ ని కలసినట్టుగా, అక్కడ ఆయన కేసీఆర్ ని కలవలేకపోయారు. జగన్ ఆతిథ్యాన్ని స్వీకరించినంత సులభంగా ఆయన కేసీఆర్ తో సర్దుకుపోలేరు. ఏదేమైనా.. వైరి వర్గాన్ని కూడా చిరునవ్వుతో పలకరించడం, దగ్గరకు తీయడంలో వైఎస్ఆర్ తర్వాత జగనే అనేది మరోసారి రుజువైంది.