ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రుల నిర్వాకాల విషయంలో జగన్ ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. తమను జగన్ ఏమీ చేయలేరంటూ ఓపెన్ ఛాలెంజ్ లు విసిరిన తెలుగుదేశం పార్టీ నేతలు, తీరా వారి వ్యవహారాల విషయంలో అరెస్టులు మొదలయ్యే సరికి కక్ష సాధింపు చర్యలని అంటున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ మంత్రుల వ్యవహారాలపై చర్యలు మొదలుకాగా, ఇప్పుడు మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై హత్యారోపణలు వస్తూ ఉండటం గమనార్హం.
మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర హస్తం ఉందని ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే భాస్కరరావు హత్యకు గురయ్యారు. మంత్రి పేర్నినానికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు భాస్కరరావు. భాస్కర్ రావు హత్యతో పేర్ని నేని నిర్వేదానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.
భాస్కరరావుకు రాజకీయ ప్రత్యర్థులు అయిన వారే ఆయన హత్య కూ సూత్రధారులని వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా బలపడుతున్నాడనే అక్కసుతో హత్యకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలిందట. ఆ సూత్రధారులకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తున్నారట భాస్కరరావు కుటుంబీకులు. హత్య చేసి వస్తే తను కాపాడుకుంటానంటూ భాస్కరరావు రాజకీయ ప్రత్యర్థులకు కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఫిర్యాదుల మేరకు కొల్లు రవీంద్ర పేరును కూడా ఈ హత్య కేసులో చేర్చారట పోలీసులు. అధికారంలో లేకపోయినా తెలుగుదేశం నేతల దురుసు ప్రవర్తనల వార్తలు వస్తూనే ఉన్నాయి. అందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తూ కొందరు నేతలు అడ్డంగా బుక్ అవుతున్నారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర పేరు ఏకంగా హత్య కేసులో వినిపిస్తూ ఉండటం గమనార్హం.