జగన్ ను అపరిమితంగా ద్వేషించిన వారిలో కాంగ్రెస్ నేతలున్నారు. తీరా జగన్ కాంగ్రెస్ ను వీడిన కొంత కాలం తర్వాత వారికి జగన్ విలువ అర్థం అవుతూ వస్తోంది. ఏపీలో 80 శాతం మంది కాంగ్రెస్ నేతలు జగన్ పంచన చేరిపోయారు. జగన్ ఊపులో మళ్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారు సదరు నేతలు. కొందరు మంత్రులు కూడా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కాంగ్రెస్ నేతలకు జగన్ రాజకీయంగా మళ్లీ వాళ్లకు అవకాశం ఇవ్వగా, తెలంగాణ కాంగ్రెస్ నేతల పయనం మాత్రం చుక్కాని లేని నావలా మారిపోయింది. వైఎస్ఆర్ మరణంతోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది. వెన్నెముక లేని కాంగ్రెస్ నేతల కోరికల మేరకు జరిగిన విభజనతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పతనావస్థకు చేరుకుంది.
సోనియా నాయకత్వం అంటూ మాట్లాడిన వారు ఇప్పుడు చాలా మంది కేసీఆర్ జేజేలు కొడుతున్నారు. మరి కొందరు రాజకీయంగా ఉనికిలోనే లేకుండా పోయారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు జగన్ విలువ పూర్తిగా ఎరుకలోకి వచ్చింది. అందుకే వాళ్లు ఇప్పుడు జగన్ ను ప్రశంసిస్తూ ఉన్నారు!
జగన్ ను ద్వేషిస్తే తమకు పడే ఓట్లు పోతాయే తప్ప.. వచ్చేది లేదని వారు అర్థం చేసుకున్నట్టున్నారు. అందుకే టీ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసించారు. ఇక మొదటి నుంచి జగన్ పై ఎప్పుడూ విమర్శలు చేయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇప్పుడు అదే రీతిన స్పందించారు. కరోనా పరిస్థితుల్లో జగన్ పాలనా దక్షతను కోమటిరెడ్డి మెచ్చుకున్నారు. కేసీఆర్ కన్నా జగన్ చాలా గొప్పగా వ్యవహరిస్తున్నారనని వెంకట్ రెడ్డి కీర్తించారు. సంక్షేమ పథకాల అమల్లో అయినా, కరోనా పరిస్థితులను ఎదుర్కొనడంలో అయినా.. కేసీఆర్ కన్నా జగన్ 100 అడుగులు ముందున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.