నక్కను తొక్కాడా ? అంతకు మించినదాన్ని తొక్కాడా ? 

కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. వారు కలలో కూడా ఊహించని పనులు వారి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అలాంటప్పుడు వీడు నక్కను తొక్కాడురా అంటుంటారు. అంటే నక్క అదృష్ట దేవతా ? ఏమో …తెలియదు.…

కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. వారు కలలో కూడా ఊహించని పనులు వారి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అలాంటప్పుడు వీడు నక్కను తొక్కాడురా అంటుంటారు. అంటే నక్క అదృష్ట దేవతా ? ఏమో …తెలియదు. ఆ సంగతి అలా ఉంచుదాం. కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడో అడవిలోకి వెళ్లి నక్కను తొక్కి ఉంటాడు. 

లేకపోతే అతనికి ఇంత  అదృష్టం పట్టదు. కేసీఆర్ తలచుకోగానే కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిపోయాడు. ఆయన టీఆర్ఎస్ లో చేరి జస్ట్ .. పది రోజులైందేమో. అంతే. అదృష్టం వరించింది. కౌశిక్ రెడ్డి నక్కను తొక్కాడో లేదో మనకు తెలియదుగానీ ఇదంతా హుజూరాబాద్ మహాత్యమని చెప్పుకోవచ్చు. 

నామినేటెడ్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి శాసన మండలికి వెళుతున్నాడు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ టిక్కెట్ తనకే ఇస్తారని కౌశిక్ రెడ్డి ఎవరికో ఫోన్ చేసి చెప్పుకున్నాడు. ఆయన అనుకున్నట్లు టిక్కెట్ ఇచ్చి వుంటే గ్యారంటీగా గెలిచేవాడో కాదో ఎవరు చెప్పగలరు? కేసీఆర్ ఆ ఆలోచన చేయకపోవడంతో రెడ్డి గారికి ఉద్యోగం ఖాయమైంది. 

కౌశిక్ రెడ్డికి ఉన్న ఓటు బ్యాంకు.. టీఆర్ఎస్ కి లాభం అవుతుందనే లెక్కలో అధికార పార్టీ ఉంది. కిందటి ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి.. ఓడిపోయినా రెండో స్థానంలో నిలిచాడు.  61 వేల ఓట్ల వరకూ సాధించాడు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న టైమ్ లోనే .. టీఆర్ఎస్ టికెట్ తనకేనని కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో టెప్ బయటకు వచ్చింది. ఆ తర్వాత కొద్దికాలానికే… కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబి తీర్థం తాగాడు. 

మండలిలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇవి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి, అధికార పార్టీకి బండ మెజారిటీ ఉంది కాబట్టి ఎన్నికలు జరిగేది ఏముంది ? ప్రతిపక్షాలు పోటీ చేసే పరిస్థితి ఎలాగూ లేదు కాబట్టి అన్ని ఏకగ్రీవాలే. కానీ ఈ ఏకగ్రీవాలకు కూడా కేసీఆర్ నో చెప్పారు. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఇప్పుడు తగిన సమయం కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ కు తెలియచేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం (అంటే కేసీఆర్) చెప్పిన కారణాలు చాలా సిల్లీగా, హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రంలో కొవిడ్ ఇంకా తగ్గలేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదట.

రోజుకు 600 కేసులు పైగా నమోదవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రమాదకరమట. రాష్ట్రంలో ఇంకా వ్యాక్సినేషన్ కూడా పూర్తి కాలేదట. అసలు ఈ వివరణకు లాజిక్ ఉందా ? మరి ఈ లాజిక్ బోనాల పండుగకు, షాపింగ్ మాల్స్ కు, సినిమా థియేటర్లకు, ఇంకా బొచ్చెడు పనులు, వ్యాపారాలు చేసుకోవడానికి ఎందుకు వర్తించలేదు. 

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలు కావు కదా. పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం లేదు కదా. జనం గుంపులుగా వచ్చే అవకాశం లేదు కదా. మరి అదేమీ లేనప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడానికి  వచ్చిన అడ్డు ఏమిటి? కేసీఆర్ జస్ట్ పేర్లు ప్రకటిస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగినట్లే. 

ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధిష్టానం కొందరికి హామీ ఇచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం కారణంగా అన్ని స్థానాలు ఏకగ్రీవం అవుతాయి. నాగర్జున సాగర్ లీడర్ కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తానని కేసీఆర్ స్వయంగా బహిరంగంగానే ప్రకటించారు. ఒకవేళ సుఖేందర్ రెడ్డని కొనసాగిస్తే.. సామాజిక సమీకరణల్లో కోటిరెడ్డికి అవకాశం ఇస్తారా… ఇవ్వరా అనేది వేచి చూడాలి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్​ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారనేది తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ ఇటీవలే టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం జోరుగానే సాగింది. విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, రజక, పద్మశాలీలకు ఎమ్మెల్సీ ఇస్తామని గ్రేటర్‌ ఎన్నికల్లోనూ కేసీఆర్ హామీ ఇచ్చారు. 

మాజీ స్పీకర్ మధుసూదనచారికి ఎమ్మెల్సీ ఖాయమని టీఆర్ఎస్ శ్రేణుల అంచనా. అదే నిజమైతే… ఒకే జిల్లాకు చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లుకు మరేదైనా పదవి దక్కే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది కీలక ప్రశ్న.