హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక సమయం సమీపించే కొద్ది తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. పాలక ప్రతిపక్ష పార్టీలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి.
ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీల నేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో జర్నలిస్టులతో మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు. పలు అంశాలపై తనదైన శైలిలో ప్రత్యర్థులపై పంచ్‌లు విసిరారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ తెచ్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హుజూరాబాద్‌లో తప్పకుండా తమ పార్టీ గెలుస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదని వ్యంగ్యంగా అన్నారు.
కాంగ్రెస్‌లో భట్టి విక్రమార్క మంచి వ్యక్తి అని ప్రశంసించారు. కానీ కాంగ్రెస్‌లో భట్టిది నడవట్లేదని, గట్టి అక్రమార్కులదే నడుస్తోందని ఎద్దేవా చేశారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా తొలి ఎన్నికలో నిరూపించుకోవాలి కదా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఎందుకు హుజూరాబాద్ వెళ్లట్లేదని కేటీఆర్ నిలదీశారు.
కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ఒకప్పుడు బీరాలు పలికారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి ఓడిపోయినా ఎందుకు సన్యాసం స్వీకరించలేదని ప్రశ్నించారు. ఇప్పుడాయన సన్యాసిలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.